మహాకూటమి మహాకల్తీ! అంటూ పంచ్‌లు ప్రాసలతో కాంగ్రెస్ విపక్షాలను జల్లెడ పట్టిన నరేంద్ర మోదీ!

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ కు ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ పార్టీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పంచ్‌లు, ప్రాసలతో ప్రతిపక్షంపై విరుచుకు పడ్డారు. విపక్షాలది మహాకూటమి కాదని అది మహా కల్తీని ఎద్దేవా చేశారు. అలాంటి కల్తీని ప్రజలు కోరుకోవడం లేదని విమర్శించారు. లోక్‌సభలో మాట్లాడిన ప్రధాని మోదీ కాంగ్రెస్‌ పై విమర్శనాస్త్రాలు ఎక్కు బెట్టారు. ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో నాటి కాంగ్రెస్ పాలనపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. 

సభలో నరేంద్ర మోదీ ప్రసంగం. ఎన్నికల సభలో ప్రసంగాన్ని తలపించింది.  మోదీ ప్రసంగంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కాగా, ఈ టర్మ్‌లో మోదీకి ఇదే చివరి ప్రసంగం. కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రతి ప్రభుత్వ సంస్థలో అవినీతి తాండవించేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థను వారు  నాశనం చేశారని మండి పడ్డారు. 


కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ బ్యాంకుల్లో కేవలం ఓ ఫోన్ కాల్ ద్వారా తమకు కావాల్సిన వారికి లోన్స్ ఇప్పించుకునేవారని ఆరోపించారు. అలాంటి మొండి బకాయిల కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడిందని అలాంటి పరిస్థితుల్లో తాము చట్టాలను కఠినం చేసి దాదాపు 3లక్షల కోట్లు బకాయిలు వసూలయ్యేలా చేశామన్నారు. అలాగే బ్యాకింగ్ వ్యవస్థలో టెక్నాలజీని ఉపయోగిస్తూ డిజిటల్ సేవలను అందు బాటులోకి  తెచ్చామని మోదీ గుర్తు చేశారు.


55 ఏళ్ల పాలనలో సాధ్యం కానివి 55 నెలల్లో చేసి చూపించామన్నారు ప్రధాని మోదీ. ఎయిర్‌ఫోర్స్ పటిష్టమవడం కాంగ్రెస్ ఇష్టం లేదని అందుకే రాఫెల్ డీల్ రద్దుకావాలని కోరుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

పార్లమెంట్ లో రాష్ట్రపతి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా నరేంద్ర మోదీ ప్రసంగ ప్రధానాంశాలు: 


*నరేంద్ర మోదీని విమర్శించే క్రమంలో కాంగ్రెస్ నేతలు దేశాన్ని విమర్శిస్తున్నారు. అందుకే వారు లండన్ వెళ్లి ఇండియా బాగోలేదంటూ ప్రెస్‌మీట్స్ పెడుతున్నారు.

*(55) సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ చేయచాతగాని పనులను (55) నెలల్లో చేసిచూపించాం. మాపై విపక్షాలు చేస్తున్నవన్నీ నిరాధారమైనవే. ఎన్నికల ముందే ఇలాంటివి సహజమే. ప్రజల కు అన్నీ తెలుసు.

*విపక్షాలన్నీ మహాకూటమి పేరుతో బీజేపీకి వ్యతిరేకంగా ఏమయ్యాయి. సంపూర్ణ మెజార్టీతో ఏర్పడిన మా ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు.  కోల్‌కతా లో విపక్షాలు కలిశాయి. అది మహాకూటమి కాదు మహా కల్తీ.  అలాంటి కల్తీ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకోరు.

*ఈ నాలుగేళ్ల లో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. 11వ స్థానం నుంచి ఆరో స్థానానికి చేరింది.  ప్రజలకు నీతివంతమైన పాలన అందిస్తున్నాం. 

*ఎదురయ్యే సవాళ్లను చూసి పారిపోయే వాళ్లం కాదు. సవాళ్లని ధీటుగా ఎదుర్కొని ప్రజలకు సుపరి పాలన అందిస్తున్నాం. అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ జవాబుదారీగా నిలుస్తున్నాం. అందుకే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ దాని అనుయాయి ప్రతిపక్ష నాయకుల నుండి మాపై తీవ్ర వ్యతిరేక్షత. ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. 

*జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ హయాంలో కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర హక్కులను కాలరాశారు. సంస్థలను నిర్వీర్యం చేశారు.  దేశానికి అత్యవసర స్థితిని పరిచయం చేసిన కాంగ్రెస్ ముద్దుబిడ్డ రాహుల్ గాంధి నేడు వ్యవస్థల నిర్వీర్యం అంటూ ఘోష పెడుతున్నారు. కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్సే కూల్చింది. ఏపీలో ఎన్టీఆర్ విషయంలోనూ అలానే వ్యవహరించింది.

*భారత సైన్యాన్ని కాంగ్రెస్ తీవ్రంగా అవమానించింది. అత్యున్నత ఆర్మీ ముఖ్య అధికారిని గూండా అని దూషించారు. ఇప్పుడేమో నరేంద్ర మోదీ వ్యవస్థలను నాశనం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.

*దేశంలో వ్యవస్థలను కాంగ్రెస్ హయాంలోనే భ్రష్టుపట్టించారు. ఎలక్షన్ కమిషన్ మీదే కాకుండా సుప్రీంకోర్టు ను కూడా బెదిరించేలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు.

*'బి సి' అంటే బిఫోర్ కాంగ్రెస్, 'ఏ డి'  అంటే ఆఫ్టర్ డైనాస్టి. కాంగ్రెస్ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదు.

*ఆర్టికల్ 356 ను కాంగ్రెస్ పార్టీ చాలా సార్లు దుర్వినియోగం చేసింది. కానీ, ఇప్పుడొచ్చి నరేంద్ర మోదీ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

*నేను చేసిన నేఱం ఏంటో తెలుసా? ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి వారి రాజరికాన్ని ఛాలెంజ్ చేయడమే.

*2010 కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఒక వైపు మన క్రీడాకారులు  పతకాల కోసం కష్టపడితే, మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం డబ్బులు కూడబెట్టు కున్నారు.

*గత 55 ఏళ్లలో ప్రభుత్వాలు 12 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇస్తే, బీజేపీ 55 నెలల పాలనలో 13 కోట్ల కనెక్షన్స్‌లు ఇచ్చాం. అభివృద్ధే లక్ష్యంగా ఐదేళ్ల లో పాలనను పరుగులు పెట్టించాం.

*కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనలో స్వచ్ఛత 38 శాతమైతే 55 నెలల్లోనే దాన్ని 98 శాతానికి చేర్చామని మోదీ తెలిపారు. 

*మన వాయుసేన పటిష్ట మవడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు.  ‘రఫెల్ డీల్ రద్దు’ కావాలని కోరుకుంటున్నారు. అందుకే నిరాధార ఆరోపణలు చేస్తున్నారు? ఇది ఎవరి ఆజ్ఞ? ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారు? ఎవరి కోసం, ఏ కంపెనీ ప్రయోజనాల కోసం రాఫెల్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తు న్నారని సూటిగా ప్రశ్నించారు. పార్లమెంట్‌లోనైనా, బయటైనా,  ఇంటా బయటా మేం నిజాలే మాట్లాడతాం, వినే ధైర్యం మీకు లేదని మోదీ విపక్షాలను విమర్శించారు. 


*మన పక్క దేశాలు యుద్ధ సామర్థ్యాలను పెంచుకుంటున్నాయి. సైన్యాన్ని పటిష్టం చేసుకుంటున్నాయి. కానీ ఇన్నేళ్లలో ఎందుకు మనం బలోపేతమవలేదు? ఇది నేఱపూరిత నిర్లక్ష్యం.  మన సైన్యం పటిష్ట మవడం కాంగ్రెస్‌కు లేదు. కాంగ్రెస్ పాలనలో సైన్యం బలహీనమైందన్న మోదీ సైనికులకు అవసరమైన ఆయుధ సామాగ్రిని అందించడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందన్నారు. సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా అందించలేకపోయిన పార్టీ సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. మన పొరుగు దేశాలు సైన్యాన్ని, యుద్దసామాగ్రిని మెరుగు పర్చుకుంటే కాంగ్రెస్ సర్కారు మాత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బలోపేతం కాకుండా చూస్తోందన్నారు. 


*నేను ‘కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం’ అందు కోలేదు.  కాంగ్రెస్‌ని రద్దు చేయాలని మహాత్మాగాంధీయే కోరుకున్నారు. ఆయన కోరికనే మేం నెరవేరుస్తున్నాం.  కాంగ్రెస్‌ లో చేరేకంటే ఆత్మహత్యే మేలని రాజ్యాంగ నిర్మాత డా. భి ఆర్ అంబేద్కర్ కూడా అన్నారు.

*మధ్య తరగతి ప్రజల కోసం గత నాలుగేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. మోకాలి శస్త్రచికిత్సలు, స్టెంట్ ధరలు, మందుల ధరలను భారీగా తగ్గించాం.  ధరల పెరుగుదల కు, కాంగ్రెస్‌కు అవినాభావ సంబంధం ఉందన్నారు. 

*ఎన్నికల ముందు ఋణమాఫీ గేమ్‌ని కాంగ్రెస్ ప్రారంభించింది. ఋణమాఫీలతో పేదరైతులకు లాభం జరగలేదు. ఋణమాఫీ మార్గాన్ని మేం కూడా ఎంచుకున్నప్పటికీ, ఋణాలు చెల్లించేలా వారిని తయారు చేయడమే మా ముఖ్య ఉద్దేశం.

*ఇజ్రాయెల్, పాలస్తీనా  రెండింటికీ మనం మిత్రులమే. సౌదీ అరేబియా, ఇరాన్ దేశాలకూ మిత్రులమే. మనం అనుసరిస్తున్న విదేశీ విధానం వల్లే అంతర్జాతీయ వేదికపై మన గొంతును గట్టిగా వినిపించ గలుగుతున్నాం.

*అవినీతిని సహించేది లేదు. అవినీతిపరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
.

*దేశంలోని దాదాపు10కోట్ల మంది ధనిక ప్రజల కోసం కూడా మరుగుదొడ్లు నిర్మించామని సెటైర్లు విసిరారు. తాము నిరుపేదలు గూడు లేని ప్రజల కోసం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ద్వారా పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా తమ ప్రాంతాల్లో ఇళ్లు కావాలని అడుగుతున్నారని తెలిపారు. ఎలాంటి పైరవీలు లేకుండానే ఈ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని మోదీ వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: