ఎడిటోరియల్ : కాపులను మళ్ళీ మోసం చేస్తున్న చంద్రబాబు

Vijaya

కాపులకు రిజర్వేషన్ కల్పించటంలో చంద్రబాబునాయుడు మళ్ళీ అదే మోసం చేస్తున్నారు. పోయిన ఎన్నికల్లో కాపులను బిసిల్లో చేరుస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్రం అగ్రవర్ణాల్లోని పేదలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయిస్తు ఏపి అసెంబ్లీ తాజాగా తీర్మానం చేసింది. అంటే కాపులను రెండోసారి కూడా చంద్రబాబు మోసం చేస్తున్నట్లే లెక్క. అధికారంలో రాగానే తన సహజగుణంతో మోసం చేశారు. మూడున్నర సంవత్సరాల ఎదురుచూసిన కాపులు తిరగబడితే అప్పుడు మంజూనాధ కమీషన్ వేసి చేతులు దులిపేసుకున్నారు.

 

సరే తర్వాత జరిగిన కథ అంతా అందరికీ తెలిసిందే. నిజానికి రిజర్వేషన్ల అంశం రాష్ట్రప్రభుత్వాల పరిధిలోనిది కాదు. ఆ విషయం స్పష్టంగా చంద్రబాబుకు తెలిసినా ఓట్ల కోసం కాపులకు తప్పుడు హామీ ఇచ్చారు. తీరా ఆ మోసం బయటపడేసరికి నెపాన్ని కేంద్రం మీదకు నెట్టేశారు ఇఫుడు. రేపటి ఎన్నికల్లో మళ్ళీ కాపుల ఓట్లు కొల్లగొట్టే విషయంలో దారి తెలియక టెన్షన్ పడుతున్నారు. ఈ నేపధ్యంలోనే అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లను నరేంద్రమోడి ప్రభుత్వం తెరపైకి తెచ్చింది.

 

పథకాలను కాపీ కొట్టటంలో పండిపోయిన చంద్రబాబు వెంటనే కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లను తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకున్నారు. వెంటనే 10 శాతంలో 5 శాతం కాపులకు అందులో కూడా మూడోవంతు కాపు మహిళలకంటూ మరో మోసానికి తెరలేపారు. ఇక్కడ కూడా కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లను అమలు చేయటం మినహా రాష్ట్రాలు మళ్ళీ అందులో మార్పులు చేసేందుకు లేదని నిపుణులు చెబుతున్నారు. పైగా అగ్రవర్ణాల్లోని పేదలకు కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే చంద్రబాబు అందులో 5 శాతం కాపులకు చేటాయించటంతో వివాదాలు మొదలయ్యాయి.

 

ఓట్ల కోసం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల కాపులకు కాపేతరుల మధ్య వివాదాలు రాజుకుంటున్నాయి. ఆ గొడవలను నివారించేందుకే కొన్ని కాపు సంఘాలు తమకు 5 శాతం రిజర్వేషన్ అవసరం లేదని స్పష్టంగా చెబుతున్నారు. 10 శాతంలో 5 శాతం వాటా తమకు అవసరం లేదని పోయిన ఎన్నికల్లో హామీ ఇఛ్చినట్లు కాపులు మొత్తాన్ని బిసిల్లో కలపాల్సిందేనంటూ కొన్ని కాపు సంఘాలు చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాయి.

 

చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల అగ్రవర్ణాల్లోకి కాపులకు, కాపేతరులకు మధ్య చిచ్చు పెట్టినట్లైంది. రాబోయే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చే విషయంలో చంద్రబాబులో అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకే సామాజికవర్గాలను ఎక్కడికక్కడ చీలిక పీలికలు చేసేసి లబ్ది పొందుదామన్న దురాలోచనే కనబడుతోంది. అందుకనే కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లను తనకు అనుకూలంగా మార్చుకోవటం అందులో కూడా మళ్ళీ మూడోవంతు మహిళలకే కేటాయిస్తున్నట్లు అసెంబ్లీలో తీర్మానం చేయించారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ 5 శాతం రిజర్వేషన్ల చుట్టూ ఇంకెన్ని వివాదాలు ముసురుకుంటాయో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: