ఎడిటోరియల్ : చంద్రబాబు ముందు మూడు గండాలు

Vijaya

అవును చంద్రబాబునాయుడు ముందు మూడు గండాలున్నాయి. వాటిని దాటే అవకాశాలు తక్కువగా ఉండబట్టే రోజు రోజుకు టెన్షన్ పెరిగిపోతోంది. నేతలతో టెలికాన్ఫరెన్సులో మాట్లాడినా, బహిరంగసభల్లో మాట్లాడుతున్నా ఆ ఫ్రస్ట్రేషన్ కనబడిపోతోంది. ఇంతకీ మూడు గండాలేమిటి ? ఏమిటంటే, రేపటి ఎన్నికల్లో ఓడిపోతే రాష్ట్రంలో ప్రశాంతంగా ఉండలేరు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేస్తారేమోనని చంద్రబాబు భయపడుతున్నారు. ఇక నిజంగానే జగన్ సిఎం అయితే అంతే సంగతులు. జగన్ కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కటాన్ని కూడా చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారు. అలాంటిది జగన్ ఏకంగా ముఖ్యమంత్రే అయిపోతే ఇంకేమన్నా ఉందా ? అందుకే జగన్ ను కాదని చంద్రబాబు ఏపిలో ప్రశాంతంగా ఉండలేరు.

 

ఇక, రెండోగండం సంగతి చూద్దాం. అది తెలంగాణా ముఖ్యమంత్రి కెసియార్ రూపంలో పొంచి ఉంది. జగన్ ను కాదని ఏపిలోనే ఉండలేని చంద్రబాబు బద్ధశతృవు కెసియార్ ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణాలో ఎలా ఉండగలరు ? ఇద్దరి మధ్య కాస్తో కూస్తో ఉన్న రిలేషన్ కూడా మొన్నటి తెలంగాణా ఎన్నికల సమయంలో తుడిచిపెట్టుకుపోయింది. ఎదుటి వాళ్ళు బాగుంటే చూసి తట్టుకోలేని చంద్రబాబు ఏకంగా ఇద్దరు బద్ధశతృవులైన ముఖ్యమంత్రుల  మధ్య ఇమడటం కష్టమే.  వాళ్ళేమి చేస్తారన్నది ముఖ్యంకాదు. వాళ్ళేమో చేసేస్తారన్న భయమే ప్రశాంతంగా ఉండనీయదు చంద్రబాబును.

 

అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ఇద్దరు శతృవులను కాదని ఏ ఎంపి పదవితోనో ఢిల్లీకి వెళ్ళిపోదామని అనుకుంటే అక్కడా సాధ్యం అయ్యేట్లు కనిపించటం లేదు పరిస్ధితులు. ఎందుకంటే, మెజారిటీ తగ్గినా మళ్ళీ బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందన్నది అందరి అంచనా. మరి రేపటి ఎన్నికల్లో తిరిగి మోడినే ప్రధానమంత్రి అవుతారో లేకపోతే మోడి స్ధానంలో ఇంకెవరైనా వస్తారో ఇప్పటికైతే సస్పెన్సే. ఒకవేళ మోడినే ప్రధానమంత్రి అయితే మోడిని కాదని ఢిల్లీలో కూడా చంద్రబాబు ప్రశాంతంగా ఉండలేరు.

 

ప్రస్తుత పరిస్దితి చంద్రబాబుకు ఎందుకొచ్చిందంటే, రాజకీయ ప్రత్యర్ధులను రాజకీయ ప్రత్యర్ధులుగా చూడకుండా ఏదో ఆగర్భ శతృవులన్నట్లు చూడటం వల్లే సమస్యలు పెరిగిపోయాయి. ఎన్నికలయిన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తనపనేదో తాను చూసుకోకుండా కెసియార్ ను పదవిలో నుండి దింపేందుకు ప్రయత్నించి దెబ్బతిన్నారు. దాంతో కెసియార్ తో బద్ధవైరం మొదలైంది. ఇక జగన్ ను ప్రధాన ప్రతిపక్షనేతగా కూడా గుర్తించటానికి చంద్రబాబు ఏమాత్రం ఇష్టపడటం లేదన్నది బహిరంగ రహస్యం. దాంతో జగన్ కు రాజకీయ వైరం కాస్త వ్యక్తిగత విరోధంగా మారిపోయింది.

 

ఫైలన్ గా నరేంద్రమోడితో విభేదాల సంగతి కొత్తగా చెప్పేదేమీ లేదు. వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి భంగపడిన చంద్రబాబు మోడిని తిట్టని రోజంటూ లేదు. అంతకుముందు నాలుగేళ్ళ పాటు బిజెపి నేతలు కూడా ఆశ్చర్యపోయేలా మోడిని పొగిడారు. అంతటితో ఆగకుండా క్యాబినెట్, అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానాలు కూడా చేశారు. మళ్ళీ తీర్మానాలన్నింటీనీ తూచ్ అనేసి పొగిడిన నోటితోనే తిడుతున్నారు. దాంతో చంద్రబాబంటే నరేంద్రమోడికి కూడా బాగా మండుతోంది. అందుకనే గుంటూరు సభలో చంద్రబాబుపై డైరెక్ట్ అటాక్ చేశారు. ఇది స్ధూలంగా చంద్రబాబుకున్న మూడు గండాలు. మరి పై మూడు గండాల నుండి చంద్రబాబు ఎలా బయటపడతారన్నది ఆసక్తిగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: