ఎడిటోరియల్ : ఆ నలుగురి పోటీ మీదే ఫోకస్ అంతా

Vijaya

రాబోయే ఎన్నికల్లో మిగిలిన సీట్ల సంగతి ఎలాగున్నా నాలుగు సీట్లలో పోటీ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తాయని చెప్పచ్చు.  ఆ నలుగురు ఎవరా అని చూస్తున్నారా ? ఇంకెవరు ? చంద్రబాబునాయుడు, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, శ్రీ భరత్. చంద్రబాబు, లోకేష్ ఏదో ఓ నియోజకవర్గం నుండి పోటీ చేయటం ఖాయం. కాకపోతే ఆ రెండు నియోజకవర్గాలేవనే విషయంలో తండ్రి, కొడుకులు సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్నారు.  అదే సమయంలో బాలకృష్ణ చిన్నల్లుడు, లోకేష్ తోడల్లుడు కూడా పోటీకి రెడీ అంటున్నారు. సరే తాత వారసత్వంగా ఇచ్చిన విశాఖపట్నం లోక్ సభ మీదే భరత్ దృష్టి నిలిచింది. కాబట్టి టిక్కెట్టుకు ఢోకా లేనట్లే.

 

అంటే ముగ్గురి విషయంలోను క్లారిటీ అయితే ఉంది. కాకపోతే నాలుగో సీటు నందమూరి బాలకృష్ణ విషయంలోనే క్లారిటీ రావటం లేదు. సీటు విషయంలోనే కాదు అసలు పోటీ చేయరని పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. మరికొందరేమో ఎంఎల్ఏగా కాకుండా రానున్న ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేయబోతున్నారు అని అంటున్నారు. దాంతో బాలయ్య పోటీ ఎంపిగానా లేకపోతే ఎంఎల్ఏగానా అన్నదే తేలటం లేదు.

 

అదే సమయంలో బాలయ్యను ప్రత్యక్ష ఎన్నికలనుండి తప్పించే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు ఫీలర్లు కూడా వినబడుతున్నాయి. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న హిందుపురం అసెంబ్లీ సీటును బాలయ్య ఎంత కంపు చేసేశారో అందరూ చూసిందే. అంత చూసిన తర్వాత మళ్ళీ బాలయ్యను చంద్రబాబు ప్రత్యక్ష ఎన్నికల్లోకి దింపుతారా ? అన్న చర్చ కూడా పార్టీలో నడుస్తోంది. సరే బాలయ్య పోటీని, భరత్ విశాఖ ఎంపి సీటును పక్కన పెట్టేస్తే క్లారిటీ రావాల్సింది తండ్రి, కొడుకుల విషయంలోనే.

 

చాలా ఎన్నికల నుండి చంద్రబాబు కుప్పం సీటులోనే పోటీ చేస్తున్నారు. కాబట్టి కుప్పంలో చంద్రబాబు గెలుపు నల్లేరు మీద నడక అనే చెప్పుకోవాలి. మరి లోకేష్ పరిస్ధితి ఏమిటి ? ప్రత్యక్ష ఎన్నికల్లో దిగితే గెలుపు మీద అనుమానంతోనే కదా దొడ్డిదోవన రెండేళ్ళ క్రితం ఎంఎల్సీని చేసింది చంద్రబాబు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా దొడ్డిదోవన ఎంఎల్సీ అయి మంత్రివర్గంలో కూర్చున్నది దేశం మొత్తం మీద ఒక్క నారా లోకేష్  మాత్రమేనేమో ? అటువంటి లోకేష్ మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నపుడు అవసరానికి మించే జాగ్రత్తలు తీసుకుంటారు చంద్రబాబు.

 

అందుకే తాను నామినేషన్ వేస్తే గెలవగలిగే కుప్పంలో కొడుకును పోటీ చేయిస్తారనే ప్రచారం ఊపందుకుంది. లోకేష్ కుప్పంలో పోటీ చేస్తే మరి చంద్రబాబు పోటీ చేయబోయే నియోజకవర్గం ఏంటి ? దానికి సమాధానంగానే హిందుపురం, నంద్యాల, తిరుపతి, పెనమలూరు నియోజకవర్గాల పేర్లు వినబడుతున్నాయి. ఇవేవీ కావని ఉత్తరాంధ్రలోని టెక్కలి లాంటి నియోజకవర్గంలో పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సరే ఎక్కడ పోటీ చేసినా మొత్తం మీద నలుగురు విషయంలో మాత్రం ఫోకస్ ఎక్కువుంటుందనటంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: