25 కేజీల బియ్యం పధకం పై పవన్ సంచలన వ్యాఖ్యలు !

Seetha Sailaja
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సంక్షేమ పధకాల ప్రకటనలను గుప్పిస్తూ ఉంటే దీనికి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఈ సంక్షేమ పధకాల పై చేసిన అశక్తికర కామెంట్స్ సంచలనంగా మారాయి. పాతిక కేజీల బియ్యంతోనే ఆగిపోకుండా పాతిక సంవత్సరాల బంగారు భవిష్యత్తును  ప్రజలకు  అందించాలన్నదే తన లక్ష్యమని ‘జనసేన’ అధినేత వ్యాఖ్యానించాడు. దీనితో సంక్షేమ పధకాలు తన ప్రయారిటీ కాదు అన్న సంకేతలు ఇస్తున్నాడు పవన్.   

ఆంధ్రప్రదేశ్  సర్వతోముఖాభివృద్ధికి మేధావుల సలహాలు అత్యంత ఆవశ్యకమని వ్యాఖ్యానిస్తూ దానికోసం ‘జనసేన’ సలహామండలి ఏర్పాటు చేసిన విషయాన్ని వివరించాడు. విష్ణు విద్యా సంస్థల అధినేత విష్ణురాజు మేథో సంపత్తిని రాష్ట్ర పురోగతికి  ఉపయోగ పడుతుంది అన్న ఉద్దేశ్యంతో  ఆయనకు సలహా మండలి చైర్మన్ బాధ్యతలు అప్పగించిన విషయాన్ని వివరిస్తూ  మాజీ  రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఇరవై ఏళ్ల పాటు సలహాదారుగా పని చేసిన పొన్నురాజ్ రిటైర్డ్ ప్రొఫెసర్ సుధాకర రావు వంటి మేధావులు తన సలహా మండలిలో సభ్యులుగా ఉన్న విషయాలను పవన్ వివరించాడు.  

అంతేకాదు పదవులు ఆశించి అనేక మంది ప్రముఖులు సలహా మండలి సభ్యులుగా పార్టీలో చేరలేదనిఅంటూ తన సలహా మండలి నియామకాల పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టాడు. ఇదిలా ఉండగా ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలో వాసవీమాత పంచలోహ విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొంటున్నాడు. వాసవి ధామ్‌లో 90 అడుగుల వాసవీ మాత పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ వైశ్యుల ఓట్లను ఆకర్షించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. 

అయితే సంక్షేమ పధకాలు లేనిదే ఒక్కరోజు కూడ పేదవాడి జీవితం గడవని నేపధ్యంలో ఇలాంటి సంక్షేమ పదకాలు అనవసరం అంటూ పవన్ చేస్తున్న కామెంట్స్ ‘జనసేన’ కు బడుగువర్గాలలో నెగిటివ్ ఇమేజ్ తెచ్చిపెట్టే ఆస్కారం ఉంది. ఎన్నికలలో జయాపజయాలను నిర్ణయించే క్రియాశీలక శక్తి బడుగు వర్గాల ఓటర్లు అయిన నేపధ్యంలో పవన్ చేస్తున్న కామెంట్స్ ను బట్టి ‘జనసేన’ రానున్న ఎన్నికలలో పేద బడుగు వర్గాలకు దూరం అవుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: