ఎడిటోరియల్ : ఉక్రోషాన్ని తట్టుకోలేకపోతున్న చంద్రబాబు

Vijaya

తెలుగుదేశంపార్టీ ప్రజా ప్రతినిధుల రాజీనామాలను చంద్రబాబునాయుడు తట్టుకోలేకపోతున్నారు. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు చీరాల ఎంఎల్ఏ ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ రాజీనామాలపై స్పందనే అందుకు నిదర్శనం. ఇద్దరు ప్రజా ప్రతినిధుల రాజీనామాలపై స్పందిస్తు ‘తాను ఇటువంటి వాళ్ళ కోసం తాను పనిచేయటం లేదని, ప్రజల కోసమే పనిచేస్తున్న’ ట్లు చెప్పారు. పైగా ‘మీరే చెప్పండి తమ్ముళ్ళు నేను ఎవరి కోసం పనిచేయాలి’.. ‘ఇటువంటి వాళ్ళు వెళ్ళిపోతే తాను భమపడేది లేదు’ అంటూ జనాలతో చెప్పారు.

 

రాజీనామాలపై చంద్రబాబు స్పందనే విచిత్రంగా ఉంది. వరుసబెట్టి ప్రజా ప్రతినిధుల రాజీనామాలు చేస్తున్న ప్రభావం చంద్రబాబు మొహంలో స్పష్టంగా కనబడింది. వైసిపి నుండి ఎంఎల్ఏలు, ఎంపిలను లాక్కున్నపుడు కనబడిన వికృతానందం ఇపుడెందుకు కనబడటం లేదు. ఎంఎల్ఏల రాజీనామాలు రావెల కిషోర్ బాబుతో మొదలైంది. తర్వాత మేడా మల్లికార్జురెడ్డి, మొన్న ఆమంచి కృష్ణమోహన్, తాజాగా అవంతి శ్రీనివాస్. రాజీనామాలు అవంతితోనే ఆగదని ఇంకా చాలామంది ఉన్నారంటూ టిడిపి వర్గాలే చెబుతున్నాయి.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ టిడిపి నుండి ప్రధాన ప్రతిపక్షం వైసిపిలోకి ఎందుకు వస్తున్నట్లు ? ఎందుకంటే, రాబోయే ఎన్నికల్లో టిడిపి గెలవదని బహుశా వాళ్ళల్లోనే అనుమానాలు పెరిగిపోతున్నట్లు స్పష్టమవుతోంది. ఆ విషయంలో అనుమానంతోనే చంద్రబాబు కూడా అనేక ప్రజాకర్షక పథకాలను ప్రకటిస్తున్నారు. అయితే, చంద్రబాబు ప్రకటిస్తున్న పథకాలు కూడా జనాలను ఆకట్టుకునేట్లు లేవని అనుమానం వచ్చేసినట్లుంది.

  

తొందరలో మరో ఎంపి కూడా టిడిపికి రాజీనామా చేసేస్తారనే ప్రచారం ఊపందుకుంది. నిజానికి అవంతితో పాటు అమలాపురం ఎంపి పందుల రవీందర్ కూడా రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ టిడిపి అప్రమత్తం అవ్వటంతో రావీందర్ ఎందుకో వెనక్కు తగ్గారు. అయితే ఎక్కువ రోజులు రవీందర్ టిడిపిలో ఉండరని సమాచారం. అదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా మరింతమంది టిడిపి ప్రజా ప్రతినిధులు రాజీనామాలు తప్పవని అంటున్నారు.

 

ఉత్తరాంధ్రలోనే ఇంకొదరు ఎంఎల్ఏలతో పాటు రాయలసీమకు చెందిన ఎంఎల్ఏలతో పాటు ఓ ఇద్దరు ఎంపిల రాజీనామాలుంటాయని జరుగుతున్న ప్రచారం చంద్రబాబుకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. అప్పుడప్పుడుగా 22 మంది వైసిపి ఎంఎల్ఏలను, ముగ్గురు ఎంపిలను లాక్కున్నపుడు జగన్ ఏమాత్రం నీరసించలేదు, స్పందిచలేదు. అదే వరుసగా ఓ ఎంఎల్ఏ  మరో ఎంపి పార్టీని వీడగానే వాళ్ళగురించి చులకనగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయ్. చంద్రబాబు ఏం చేసినా టిడిపి అధికారంలోకి రాదన్న విషయం వాళ్ళకి అర్ధమైనట్లుంది. అందుకనే వరుసబెట్టి ఎంఎల్ఏలు, ఎంపి రాజీనామాలు చేస్తున్నారు. అందుకనే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: