విశాఖలో కలసిన మనసులు...!!

Satya
తెలుగు సినిమా పరిశ్రమలో ఓ గొప్పదనం ఉంది. ఎవరి గొడవలు వారికి ఉన్నా అందరూ మాత్రం కల్సిపోతారు. నిన్నటి విషయాలను మనసులో పెట్టుకోకుండా ఒక్కటిగా చేతులు కలుపుతారు. టాలీవుడ్లో ఆ గొప్ప గుణం అప్పటి నటులు అన్న నందమూరి, అక్కినేని నుంచి వారసత్వంగా వచ్చిందనే  చెప్పుకోవాలి. అన్ని రంగాల్లో మాదిరిగానే సినిమా రంగంలోనూ రాగద్వేషాలు ఉంటాయి. అయితే వాటిని పక్కన పెట్టి ముందుకు రావడం కూడా అక్కడే కనిపిస్తుంది.


విశాఖలో నిన్న జరిగిన భారీ తారా తోరణం సినీ ప్రియులను అలరించింది. టీ సుబ్బరామిరెడ్డి, టీవీ 9 కలిపి అందించిన జాతీయ అవార్డులతో తెలుగు సినిమా పులకించింది. మంచి చిత్రాలను ఎంపిక చేసి ఇచ్చిన ఈ ఆవార్డులు తెలుగు ఆడియన్స్ అభిరుచికి అద్దం పట్టేలాగానే ఉన్నాయి. మోహన్ బాబు, బాలక్రిష్ణ, నాగార్జున అవార్డులను అందుకున్నారు. వేదిక మీద బాలయ్య, చిరు, నాగ్, మోహన్ బాబు ఒకె మారు కనిపించడం తో అభిమానులు ఆనందపరవశులయ్యారు. ఈ నటుల మధ్య విభేదాలు ఉన్నాయన్న మాటకు తావు ఇవ్వకుండా అందరూ చేతులు కలిపి నవ్వుతూ ఇచ్చిన పోజులు వారి ఫ్యాన్స్ ని సైతం అలరించాయి.


ఈ మధ్యనే బాలయ్య, చిరుల మధ్య పాత గొడవలను బయటకు తీసి రచ్చ చేసిన మెగా బ్రదర్ నాగబాబు వ్యవహారం తెలిసిందే. అయితే  ఈ ఫంక్షన్లో ఆ ప్రభావం ఎక్కడా కనిపించలేదనుకోవాలి. బాలయ్యకు స్వయంగా చిరంజీవి అవార్డు ఇస్తే చిరుకు బాలయ్య అవార్డు ఇచ్చి  హత్తుకున్నారు. ఇక నాగ్, బాలయ్యల మధ్యన గొడవలు అంటూ వచ్చిన వార్తలు తప్పు అనిపించేలా ఇద్దరు సీనియర్లు కలుపుగోలుగా  కనిపించారు. అలాగే మోహన్ బాబు చిరుల మధ్య ఇంతటి స్నేహం ఉందా అనిపించేలా ఇద్దరూ ఒకే అవార్డ్ షేర్ చేసుకుంటామనడం కూడా తెలుగు అభిమానం ఏంటో  చాటి చెప్పింది. 


ఇక ఈ అవార్డుల పండుగకు టాప్ స్టార్స్ ని రప్పించడంలో టీఎస్సార్ చేసిన క్రుషి ఫలించిందనే చెప్పాలి. ఈ గొప్పదనం ఆయనదేనని అటు నటులు, ఇటు ప్రజలు కూడా అంటున్నారు. నిజానికి అవార్డుల ఫంక్షన్లకు ఈ మధ్య కాలంలో అగ్ర నటులు పెద్దగా రావడం లేదు. అలాటిది సూపర్ స్టార్లను అందరినీ తీసుకువచ్చి సినిమా పండుగ చేసిన ఘనత‌ మాత్రం టీ సుబ్బరామిరెడ్డిదే. ఆయన కాబట్టే అందరూ వచ్చారన్న మాట కూడా ఉంది. మొత్తానికి ఈ అవార్డుల పండుగ మాత్రం విశాఖలో మరో మేలి మలుపు సంబరంగానే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: