పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి

siri Madhukar

భారత దేశంలో అలజడి సృష్టించడానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పలు రకాలుగా దాడులకు పాల్పడుతున్నారు.  ముఖ్యంగా జమ్మూ-కాశ్మీర్, పంజాబ్ లో సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకొని ఎన్నో దాడులకు పాల్పడ్డారు.  అయితే భారత జవాన్లు సైతం ఈ దాడులను తిప్పికొడుతూనే ఉన్నాయి.  పుల్వామా ఉగ్రదాడిలో 42 మంది సీఆర్పీఎఫ్‌ జవానులు అమరులైన ఘటన మరువక ముందే మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు.  పుల్వామా జిల్లాలోని పింగ్లన్‌ ప్రాంతంలో భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో వారిని మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి.


ఈ ఘటనలో మేజర్‌ సహా ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. వీరంతా 55 రాష్ట్రీయ రైఫిల్స్‌ దళానికి చెందిన వారు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగినట్లుగా సమాచారం.  పుల్వామా ఘటనతో సైన్యం ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి పింగ్లాన్ ప్రాంతంలో సైన్యానికి కొందరు ఉగ్రవాదులు తారసపడ్డారు. ఒక ఇంట్లోకి చొరబడిన ముష్కరులు భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు.


ఉగ్రవాదుల దాడిని సమర్థవంతంగా సైనికులు ఎదుర్కొంటున్న క్రమంలోనే  మేజర్‌ సహా ముగ్గురు జవాన్లపై బుల్లెట్ల వర్షం కురిసింది.  దాంతో వారు అక్కడికక్కడే వీరమరణం పొందినట్లు తెలుస్తుంది.  దాడికి పాల్పడిన వారు పుల్వామా ఉగ్రదాడికి పాల్పడ్డ జైషే మొహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు.  ప్రస్తుతం ఉగ్రవాదులకు - భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: