సక్సెస్ కోసం చంద్రబాబు సూపర్ ప్లాన్ ఇదే..!!

Vasishta

ఏపీలో టీడీపీ జోరు పెంచింది. కోడ్ కూయకముందే పనులన్నీ చక్కబెట్టేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ట్రై చేస్తున్నారు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. షెడ్యూల్ విడుదలయ్యేనాటికి సుమారు 100 స్థానాల అభ్యర్థులను ప్రకటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యర్థుల ఎత్తులను సైతం అంచనా వేస్తూ అధినేత చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు.


ఏపీ ఎన్నికల బరిలో ముందస్తు వ్యూహాన్ని అమలు చేయాలని టిడిపి ప్రణాళికలు రచిస్తోంది. ప్రత్యర్థుల అంచనాలకు అందని రీతిలో ముందే అభ్యర్థులను ప్రకటించేసి.. విపక్షాలను డిఫెన్స్ లో పడేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఇప్పటికే వంద నియోజకవర్గాలో అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. అభ్యర్థుల జాబితాలు బయటకు రాకపోయినా.. టిడిపి శ్రేణులు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేస్తున్నాయి.


ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే టీడీపీ శ్రేణులు ప్రచారం మొదలుపెట్టేశాయి. మిగతా పార్టీల కంటే రేసులో ముందుండేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విధివిధానాలు నిర్ణయించడం కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తూ ముందుకు సాగుతోంది. మేనిఫెస్టో కమిటీని సైతం ప్రకటించిన అధినేత.. సంక్షేమానికి పెద్దపీట వేసేలా మేనిఫెస్టో ఉండాలని సూచించారు. అందుకు తగ్గట్టే యనమన రామకృష్ణుడు నేతృత్వంలోని టీం కసరత్తు చేస్తోంది.


వైసీపీ దూకుడును కూడా గమనించిన అధినేత చంద్రబాబు.. పూర్తిస్థాయిలో పార్టీకే సమయం కేటాయిస్తున్నారు. నిత్యం నియోజకవర్గాల సమీక్షలో తలమునకలయ్యారు. రోజుకు ఒకటి రెండు పార్లమెంటు నియోజకవర్గాలను సమీక్షిస్తూ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇబ్బంది లేని చోట వెంటనే ప్రచారం చేసుకోవాలని అభ్యర్థులకు ఆదేశాలిస్తున్నారు. కోడ్ అమల్లోకి రాకముందే వందమంది అభ్యర్థులను అనౌన్స్ చేసేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు. అలా చేయడం ద్వారా అభ్యర్థులు ప్రచారంలో ముందుండేందుకు అవకాశం ఉంటుంది. ప్రత్యర్థులపై పైచేయి సాధించినట్లవుతుంది.


గతంలో నామినేషన్ చివరి వరకూ అభ్యర్థులను ప్రకటించకుండా టీడీపీ నాన్చేది. కానీ ఈసారి అలా కాకుండా ముందే అభ్యర్థులను ప్రకటించేయాలని నిర్ణయించింది. ఎక్కడైనా చిన్నచిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తోంది. తద్వారా గత ఎన్నికల కంటే భిన్నమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: