ఎడిటోరియల్ : చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ప్రయోగం ? తిరుపతి నుండేనా ?

Vijaya

చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో భారీ ప్రయోగం చేయనున్నారా ? పార్టీ వర్గాల ప్రకారం అవుననే సమాధానం వస్తోంది.  జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో ఒకటి రెండు సీట్లు తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో కొత్త నేతలను అభ్యర్ధులుగా దింపాలని చంద్రబాబు నిర్ణయించారట. కుప్పంలో చంద్రబాబు/ నారా లోకేష్ పోటీ చేయబోతున్నారు. అలాగే పలమనేరులో మంత్రి ఎన్ అమరనాధరెడ్డి మళ్ళీ పోటీ చేయబోతున్నారు. అంటే మిగిలిన నియోజకవర్గాల్లో కొత్తవారే పోటీ చేస్తారని సమాచారం.

 

కడప జిల్లాలోని రాజంపేట లోక్ సభ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కొందరు అభ్యర్ధులను చంద్రబాబు ప్రకటించారు. అందులో చిత్తూరు జిల్లాలో రెండు నియోజకవర్గాలున్నాయి. పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పుంగనూరులో అనూషా రెడ్డి అభ్యర్ధిత్వాలను చంద్రబాబు ప్రకటించారు. అనూషారెడ్డి అంటే మంత్రి అమరనాధ రెడ్డి మరదలే. మిగిలిన 10 నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల అభ్యర్ధులు దాదాపు ఖరారు కాగా కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

 

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం చిత్తూరులో మాజీ ఎంఎల్ఏ ఏఎస్ మనోహర్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మనోహర్ యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. అయితే, తన పేరు పరిశీలనలో ఉందని తెలిసి మళ్ళీ యాక్టివ్ అవుతున్నారట. శ్రీకాళహస్తిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొడుకు బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ దక్కే అవకాశాలున్నాయి. టికెట్ కోసం ఎస్ సివి నాయుడు పోటీ పడుతున్నారు.

 

నగిరిలో అశోక్ రాజుకి టికెట్ దాదాపు ఖాయమని సమాచారం. చంద్రగిరిలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని పోటీ చేస్తారు. మదనపల్లి నియోజకవర్గంలో మాజీ ఎంఎల్ఏ దమ్మాలపాటి రమేష్ కానీ రాందాస్ చౌదరి కానీ పోటీ చేసే అవకాశాలున్నాయి. సత్యవేడులో మాజీ ఎంఎల్ఏ హేమలత కూతురికి టికెట్ దాదాపు ఖాయమనే అంటున్నాయి.  గంగాధర నెల్లూరు, పూతలపట్టు, తంబళ్ళపల్లి  నియోజకవర్గాల్లో అభ్యర్ధులను వెతుకుతున్నారు.

 

ఇక జిల్లాలో కీలకమైన తిరుపతి నియోజకవర్గంలో చంద్రబాబే పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. చంద్రబాబు తిరుపతిలో పోటీ చేయటం ఖాయమైతే కుప్పంలో పుత్రరత్నం లోకేష్ పోటీ చేయటం ఖాయమైనట్లే. లోకేష్ పోటీకోసం రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు పరిశీలించినా గెలుపు విషయంలో ఎక్కడా నమ్మకం కుదరలేదట. అందుకే కుప్పానికి మించిన సేఫ్ నియోజకవర్గం మరోటి లేదని అంటున్నారు. సిట్టింగ్ ఎంఎల్ఏల్లో చాలామందిపై విపరీతమైన అవినీతి ఆరోపణలుండటంతో చంద్రబాబుకు కొత్తవాళ్ళతో ప్రయోగాలు చేయటం తప్ప వేరే దారి కూడా కనబడటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: