ఎడిటోరియల్ : చంద్రబాబు, పవన్ కలిస్తేనే మంచిదా ?

Vijaya

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ పొత్తులు పెట్టుకోవాలనే జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారా ?  టిడిపి, జనసేన కలిసే ఎన్నికల్లోకి వెళ్ళాలని జగన్ కోరుకుంటున్నట్లే కనబడుతోంది. అప్పుడుకాని పవన్ శక్తి ఏమిటో అర్ధంకాదు. ఇంతకాలం చంద్రబాబు విషయంలో పవన్ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అంటే పరోక్షంగా చంద్రబాబుకు సహకరిస్తున్నట్లే అనుకోవాలి. అధికార పార్టీని నిలదీయాల్సిన పవన్ ఏ విషయంలో అయినా జగన్నే తప్పుపడుతున్నారంటే ఏమిటర్ధం ?

 

ఎక్కడైనా ప్రతిపక్షాలు అధికారపార్టీని నిలదీస్తాయి. కానీ ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్ష నేతను నిలదీయటం దేశం మొత్తం మీద చూసుకుంటే ఒక్క ఏపిలోనే జరుగుతోంది. అదేమని ప్రశ్నిస్తే పవన్ తిక్క తిక్క సమాధానాలిస్తారు. అంటే పవన్ కు ఏ ప్రజా సమస్య మీద కూడా స్ధిరమైన అభిప్రాయం కానీ అవగాహన కానీ లేదన్న విషయం తెలిసిపోయింది. చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో ఎలా గట్టెంకిచాలన్నదే పవన్ లక్ష్యంగా కనిపిస్తోంది.


అందుకనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ ఏ కార్యక్రమం పెట్టుకున్నా వెంటనే పవన్ కూడా పోటీగా మరో కార్యక్రమం పెట్టుకుంటున్నారు. దాంతోనే చంద్రబాబును పవన్ ఎంతలా రక్షించే ప్రయత్నం చేస్తున్నారో అర్ధమైపోతోంది. అందుకనే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కలిసే పోటీ చేస్తారని జగన్ ఎప్పటి నుండో చెబుతున్నారు. ఎందుకంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం వైసిపికే పడతాయన్నది జగన్ ఆలోచన.


నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబుపై అన్నీ వర్గాల్లోను విపరీతమైన వ్యతిరేకత కనబడుతోంది. అదే సమయంలో పవన్ విషయంలో కూడా జనాల్లో పెద్ద సానుకూలత ఏమీ లేదు. అంతేకాదు కాపు సామాజికవర్గంలో కూడా పవన్ అంటే సానుకూలత లేదు. ఇటువంటి సమయంలో టిడిపి, జనసేనలు కలిసి పోటీ చేస్తే జనాలు  ఏ విధంగా రియాక్టవుతారో చూడాల్సిందే.

 

పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన అనేక ప్రధానమైన హామీల్లో కాపులను బిసిల్లో చేర్చటం కూడా కీలకమైందే. ఆ హామీని నెరవేర్చకుండా మళ్ళీ ఎన్నికలకు వెళుతున్నారు చంద్రబాబు. అటువంటి చంద్రబాబుకు పవన్ వత్తాసు పలికితే జనసేన ఒంటరిగా పోటీ చేస్తే వస్తాయనుకుంటున్న పదిసీట్లు కూడా వచ్చే అవకాశాలు లేవనే చెప్పాలి. అంటే ఒకరి మైనస్ మరొకరికి అంటుకునే అవకాశాలే స్పష్టంగా కనబడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: