ఎడిటోరియల్ : లోకేష్ పోటీకి వెనకాడుతున్నారా ?

Vijaya

క్షేత్రస్ధాయిలో పరిస్దితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది అందరికీ. ఎందుకంటే, సీనియర్ నేతలైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజీనామా చేశారు. రేపో మాపో మంత్రి నారాయణ కూడా రాజీనామాకు రెడీ అవుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల గోదాలో దూకాలనుకుంటున్నవారంతా ఎంఎల్సీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. సీనియర్ నేతలే రాజీనామాలకు సిద్ధపడిన తర్వాత కూడా యువనాయుడుకు, కాబోయే ముఖ్యమంత్రిగా టిడిపి నేతలతో ప్రచారం చేయించుకుంటున్న యువనేత నారా లోకేష్ మాత్రం ఎంఎల్సీకి రాజీనామా విషయంలో ఎందుకు మాట్లాడటం లేదు.

 

రాబోయే ఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తానని లోకేష్ అయితే గతంలో ఓసారి ప్రకటించారు. తర్వాత మళ్ళీ ఆ ఊసే ఎత్తలేదనుకోండి అది వేరే సంగతి. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఎన్నికల వేడి బాగా రాజుకుంది. సోమిరెడ్డి ఎంఎల్సీకి రాజీనామా చేసేసి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. వరుసగా నాలుగుసార్లు ఓడిపోయిన సోమిరెడ్డి ఐదేసారైనా గెలుస్తారో లేదో చూడాల్సిందే.

 

ఇక నెల్లూరు సిటీ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు రెడీ అవుతున్న నారాయణ కూడా ఎంఎల్సీ పదవికి రాజీనామా రెడీ అవుతున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పోటీ చేయటానికి సిద్ధపడగానే ప్రచారం కూడా మొదటుపెట్టేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో పోటీ చేయటానికి వీలుగా రామసుబ్బారెడ్డి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక మిగిలింది యనమల రామకృష్ణుడు. అయితే, యనమలకు మళ్ళీ పోటీ చేసే ఉద్దేశ్యం లేదు. కాబట్టి సమస్య లేదు.

 

సీనియర్ల విషయం తెేలుతుండటంతో లోకేష్ గురించే పార్టీలో చర్చ మొదలైంది. పోటీ చేస్తానని  ప్రకటించారు కానీ ఎక్కడి నుండి పోటీ చేసేది మాత్రం తేల్చటం లేదు. ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గం పేరు ప్రచారంలోకి వస్తోంది. ఒకసారి హిందుపురమని, మరోసారి పెనమలూరని. ఇవేవీ కాదు తండ్రి నియోజకవర్గం కుప్పం నుండే పోటీ చేస్తారనీ ప్రచారమవుతోంది.

 

అసలు నియోజకవర్గమే డిసైడ్ చేసుకోలేకపోతున్నారా ? లేకపోతే నియోజకవర్గం ఖాయమైనా బయటకు చెప్పటం లేదా ? అదీకాకపోతే అసలు పోటీకే వెనకాడుతున్నారా ? అన్న విషయంపైనే పార్టీలో బాగా చర్చ జరుగుతోంది. మొత్తానికి సీనియర్లే రాజీనామాకు సిద్ధపడుతున్నా జూనియర్ అయిన లోకేష్ వ్యవహారమే సస్పెన్సుగా మారిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: