ఎడిటోరియల్ : చంద్రబాబుకు రాజమండ్రి ఎంపి షాక్

Vijaya

ఏ రోజు ఏ నేత ఏ వైపు నుండి షాక్ ఇస్తారో తెలీక చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరిగిపోతోంది. తాజాగా రాజమండ్రి ఎంపి మురళీ మోహన్ కూడా చంద్రబాబుకు షాకిచ్చారు. ఇప్పటికే ఇద్దరు ఎంపిలు, ఇద్దరు ఎంఎల్ఏల షాక్ ను తట్టుకోలేకపోతున్న మురళీమోహన్ ఇచ్చిన షాక్ తో ఏమైపోతారో ఏమో అన్నట్లుంది పరిస్దితి. ఇక్కడ విషయం ఏమిటంటే ఎవరైనా పోటీ నుండి తప్పుకుంటాన్నట్లు ప్రకటించినా లేకపోతే ఏ కారణం వల్ల ఫోన్ కు అందుబాటులో లేకపోయినా వెంటనే వాళ్ళపై చంద్రబాబులో అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

బహుశా ఇపుడు రాజమండ్రి ఎంపి పైన కూడా ఇటువంటి అనుమానాలు మొదలైపోయుంటాయి. ఎందుకంటే మొన్నటి వరకూ రాజమండ్రిలో తానే పోటీ చేస్తానని మురళీ చెప్పేవారు. ఏ కారణంచేతనైనా తాను పోటీ చేయలేకపోతే తన కోడలు రూప కచ్చితంగా పోటీ చేస్తుందని చెప్పేవారు. అలాంటిది చివరి నిముషంలో తాను పోటీ చేయబోవటం లేదని తానే కాకుండా తన కోడలు కూడా పోటీకి దూరమని మురళీ పార్టీ నేతలతో స్పష్టం చేశారు. దాంతో అందరిలోను ఒక్కసారిగా అనుమానాలు మొదలైపోయాయి.

 

దానికితోడు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన రాజమండ్రి ఎంపి స్ధానంలోని అసెంబ్లీలపై సమీక్ష జరగబోతోంది. ఇంకోవైపు రెండు రోజుల్లో షెడ్యూల్ వస్తోంది. ఇటువంటి సమయంలో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారంటే అర్ధమేంటి ? మొదట్లోనే ఆ విషయం చెప్పుంటే అది వేరే సంగతి. ఈ పాటికి ప్రత్యామ్నాయాన్ని చూసుకునే వారు. ఇఫ్పుడు కూడా కొంపలేమీ ముణిగిపోలేదు. కానీ ఇప్పటికప్పుడు ఆర్ధికంగా అంతటి బలమైన నేతను చూసుకోవాలంటే ఎవరికైనా కష్టమే కదా ?

 

అసలు ఎంపి చివరి నిముషంలో అటువంటి నిర్ణయం తీసుకోవటానికి కారణాలేంటి ? ఏమిటంటే, నియోజకవర్గంలో చేయించుకున్న సర్వేనే కారణమంటున్నారు. చంద్రబాబు చేయించుకునే సర్వేలు ఎలాగున్నా లోక్ సభ వ్యాప్తంగా ఎంపి ప్రత్యేకంగా సర్వే చేయించుకున్నారట. అసెంబ్లీలు కానీ లోక్ సభలో కానీ గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు ఫీడ్ బ్యాక్ వచ్చిందట. ఎంఎల్ఏలపై దెబ్బ పడేటపుడు ఎంపిగా తాను మాత్రం ఎలా గెలుస్తానన్న ఆలోచన వచ్చిందట ఎంపిలో.

 

ఇదే విధమైన ఫీడ్ బ్యాక్ కాకినాడ ఎంపి తోట నర్సింహంకు కూడా వచ్చింది. అందుకనే కాకినాడ ఎంపిగా తాను పోటీ చేయటం లేదని తప్పుకున్నారు. కాకపోతే అందుకు అనారోగ్యాన్ని కారణంగా చూపారు. అయితే అదే సమయంలో జగ్గంపేట ఎంఎల్ఏ టికెట్ భార్యకు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. శ్రీకాకుళం ఎంపి కింజరాపు రమ్మోహన్ నాయుడు, కేశినేని నాని అండ్ కో కూడా పోటీ చేయటానికి ఇష్టపడటం లేదు. తాజాగా మురళీ విషయంలో  చంద్రబాబు ఏం చెబుతారో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: