ప్రజలెందుకు దండగ - కొడుకు ఉండగ దండిగ: చంద్రబాబుపై మోడీ ఆరోపణలు

పుత్రులపై ధృతరాష్ట్రుని గుడ్డి ప్రేమ - చరిత్రలో కురుక్షేత్ర సంగ్రామానికి పునాదులేసింది. అయితే అదే పుత్రొత్సాహం నేడు ఆంధ్రప్రదేశ్ కొంపముంచుతుంది. బాబు వస్తే జాబు వస్తుందన్న నినాదం నాడు మార్మోగింది. కాని ఇప్పుడు బాబోయ్! బాబొస్తే జాబ్ గోవిందా! అనే రోజులు తటస్థించనున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగేశారు.


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ఎత్తకుండా ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. విశాఖలో నిర్వహించిన బీజేపీ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘ఇక్కడున్న నేతలు యూ-టర్న్ తీసుకోవడంలో గొప్పోళ్లు. ఇప్పుడు తెలుగు వారికి ద్రోహం చేసిన వారితో చేతులు కలిపారు. ఏపీకి వాళ్లు ఏం చేస్తారు? దేశానికి వారి ఎజెండా ఏంటో చెప్పలేదు. కాని అందరి ఏకీకృత అజెండా - లక్ష్యం మోదీని దించడమే’ అని ప్రధాని మోదీ పరోక్షంగా చంద్రబాబు మీద విమర్శలు చేశారు.


అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కొందరు పగలూ రాత్రి బీజేపీపై అబద్ధాలు చెబుతున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. ప్రజల పిల్లలను ముందుకు తీసుకెళ్లాల్సిన వారు, ప్రజల సొమ్ముతో సొంత పిల్లలను ముందుకు తీసుకెళ్లడం మీద దృష్టి పెట్టారని ప్రధాని మోదీ పరోక్షంగా చంద్రబాబు మీద విమర్శలు చేశారు.


మనకు అబద్ధాలు చెబుతూ కేంద్రంపై కొందరు అపోహలు మోపుతున్నారు. వారి అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడు కోవడానికి రాత్రింబవళ్లు అబద్ధాలు చెబుతున్నారు. మనపై జరుగు తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి వారి మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇక్కడి నేత ఏపీ బిడ్డల భవిష్యత్‌ను చూడాల్సిందిపోయి, తన కొడుకు భవిష్యత్ ను చూసుకుంటున్నారు. మేం పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నమంటే మాకు ఎలాంటి భయంలేదు మాపై ఎలాంటి ఆరోపణలులేవు. అవినీతిలో కూరుకుపోయినవాళ్లే భయపడతారు. వారి అవినీతి ఫైళ్లు ఎక్కడ బయట పడతాయోనని వణుకు పుడుతోంది’


ఇక్కడున్న కొందరునేతలు భయపడాలి, ఎందుకంటే వారు చేసిన అవినీతి వారిని వెంటాడుతుంది కాబట్టి. కుటుంబపాలన, అవినీతి గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసు. పదేపదే మాటమార్చే వ్యక్తి యూటర్న్ తీసుకుంటున్న నేతలు ఈ ప్రాంత అభివృద్ధికి ఏం చేయగలరు. తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మాపై నిందలు వేస్తున్నారు. యూటర్న్ తీసుకున్న నేతలు ఎలాంటి వారితో చేతులుకలిపారో? ఆలోచించండి వీరు తెలుగువారి ఆత్మగౌరవాన్నిదెబ్బతీసిన వారితో జతకట్టారు’అంటూ మండి పడ్డారు.


దేశంలో చంద్రబాబు తీసుకున్నన్ని యూటర్నులు మరే ఇతర నాయకుడు గతంలో తీసుకోలేదని విమర్శించారు. విశాఖపట్నం లో “సత్యమేవ జయతే బహిరంగ సభ” లో పాల్గొన్న మోదీ తన అసమర్థతను కప్పిపుచ్చు కోవ టానికి తనపై విమర్శలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.


ఒక్క మాటపై నిలబడలేని వ్యక్తి విశాఖపట్నం జిల్లా అభివృద్ధికి పాటుపడతారా? అంటూ నిలదీశారు. ఉత్తరాంధ్ర, ఏపీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. యూటర్న్ లు తీసుకున్న నాయకుడు ఏయే పార్టీలతో కూటమి కట్టారో? చరిత్ర చెపుతుందన్నారు.  అలాగే కొత్తగా ఏ పార్టీత్ప జట్టు కడుతుందో ఇప్పుడు అర్థం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీతో జతకట్టి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బకొట్టారని నరేంద్ర మోదీ ఆరోపించారు.


పేదప్రజల పక్షాన పనిచేస్తున్నందుకా?  లేక నల్లధనాన్ని బయటపెడతానన్న తన మాటలకు భయంతో తనను పదవీ విచ్యుతుడిని చెయ్యాలనుకుంటున్నారా? అని నిలదీశారు. నల్లధనం వెలికితీస్తున్నాననే తనపై కుట్రలు పన్నుతున్నా రంటూ ఆరోపించారు. నవభారత నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న నరేంద్ర మోదీని పదవీచ్యుతుడుని చెయ్యాలని మహాకూటమి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశ ప్రజలకు మంచి పాలన అందించడమే తన లక్ష్యమన్నారు ప్రధాని నరేంద్రమోదీ. 


ఏపీకి కేంద్రం సాయం చేసినా, అవినీతిలో కూరుకుపోయి కొందరు కేంద్రం పై దుష్ప్రచారం చేస్తూ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు ప్రధాని మోదీ. తమ అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు, రాత్రింబవళ్లు విమర్శలు చేస్తూ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు మంచి చేయడానికి తాము ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని తమ నిర్ణయాలతో కొందరికి భయం మొదలయ్యిందన్నారు. శుక్రవారం విశాఖ రైల్వే గ్రౌండ్స్‌లో నిర్వహించిన బీజేపీ ప్రజా చైతన్య సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ టీడీపీ, విపక్షాలు టార్గెట్‌ గా విమర్శనాస్త్రాలు సంధించారు.


మోదీ భారత్ మాతా కీ జై నినాదాలతో ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలుగులో మాట్లాడి అందర్ని ఆకట్టుకున్నారు. ‘ప్రియమైన సోదరీ సోదరుల్లారా, నమస్కారం. అందమైన విశాఖను చూస్తే నా మనసు పులకరిస్తుంది. నరసింహస్వామి ఉన్న పుణ్యభూమి, విప్లవ వీరుడు అల్లూరి తిరిగిన ప్రాంతం. తెన్నేటి విశ్వనాథం లాంటి మహానాయకులు ప్రాతినిధ్యం వహించిన నగరం. పారిశ్రామికంగా, పర్యాటకంగా దేశాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న నగరం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నామని’ ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడారు.


ఉత్తరాంధ్ర ప్రజల కోసం ఓ శుభవార్త తీసుకొచ్చాను. మీ చిరకాల కోరికైన విశాఖ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేసి విభజన చట్టంలో ముందగుడు వేశాం. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినా, విశాఖ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలమైన జోన్‌ ను అందించాలన్న ఆకాంక్షతో కీలక నిర్ణయం తీసుకున్నాం. ఈ జోన్ ద్వారా కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుతో పాటు ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయడంలో ఈ సేవకుడు నిమగ్నమై ఉన్నాడు. విశాఖను స్మార్ట్ సిటీగా చేసేందుకు ఎన్నో ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి’అన్నారు.


పేదలు, మధ్యతరగతి, రైతులు బతుకుల్లో వెలుగు నింపుతున్నందుకు నన్ను ఓడించాలని చూస్తున్నారు. దేశ అభ్యున్నతికి కృషి చేస్తుంటే మమ్మల్ని అధికారం నుంచి దించాలని చూస్తున్నారు. భావసారూప్యత లేని పార్టీలు సరైన పాలనను అందించలేరు. రాజకీయ దళారులు, దేశ ద్రోహులు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డారు. మోదీపై విరోధంతో దేశాన్ని దెబ్బ తీయాలని చూస్తున్నారు’ అంటూ నిప్పులు చెరిగారు.


మన దేశంపై తీవ్రవాద దాడులు చేస్తున్న పాకిస్థాన్‌ వైఖరిని ప్రపంచమంతా తప్పుపడు తోంది. మన దాయాదిని ప్రపంచమే వెలెత్తి చూపిస్తుంటే మన దేశంలో కొందరు నేతలు వారికి మద్దతుగా మాట్లాడటాన్నిఏమనాలి. మహా కూటమి పేరుతో మన సైనికుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీసేలా మాట్లాడుతున్నారు. ప్రజలు ఈ వ్యాఖ్యల్ని గమనించాలి.


ఈ వ్యాఖ్యల్ని పాకిస్థాన్ పార్లమెంట్‌ లో ప్రస్తావించారంటే ఈ నేతల్ని ఏమనాలి. ధృడమైన ప్రభుత్వం ఉన్నప్పుడే మన జవాన్లు, రైతులు సురక్షితంగా ఉంటారు. భారత ప్రభుత్వం రైతులకు ‘ప్రధాని రైతు సమ్మాన్ యోజన’ ను రైతు ప్రగతి కోసం తెచ్చాం..రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం అన్నారు’ మోదీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: