అభినందన్ అప్పగింత.. తెలుగు మీడియా ఓవర్ చేసిందా..?

Chakravarthi Kalyan

వింగ్ కమాండ్ అభినందన్ అప్పగింత విషయంలో శుక్రవారమంతా టీవీల్లో ఒకటే హడావిడి సాగింది. పాక్ సైన్యం చేతికి చిక్కి ధైర్యంగా నిలబడిన నేషనల్ హీరో అభినందన్ ఇండియాకు వస్తున్న వార్తను కవర్ చేసేందుకు భారత మీడియా అంతా పోటీపడింది. టీవీ ఛానళ్లన్నీ వాఘా సరిహద్దులో సైన్యానికి ధీటుగా మొహరించాయి.



అభినందన్ సాయంత్రం 3-4 గంటల మధ్య ఇండియాకు వస్తాడని అంతా ఆశించారు. అందుకే టీవీ ఛానళ్లలో ఉదయం నుంచే చర్చలు ప్రారంభించారు. అభినందన్ భారత్ లో అడుగుపెట్టే దృశ్యాల కోసం జనం కూడా టీవీల ముందు కూర్చున్నారు. కానీ అప్పగింత ప్రక్రియ ఆలస్యమైంది.



ఈ సమయంలో తెలుగు మీడియా కాస్త ఎక్కువ హడావిడి చేసింది. అభినందన్ కాన్వాయ్ వాఘాకు చేరుకోగానే.. సాయంత్రం ఆరుగంటల సమయంలో అభినందన్ భారత్ వచ్చేశాడంటూ వార్తలు ఇచ్చేశాయి.. దేశభక్తి గీతాలతో అదరగొట్టాయి. భారత్ లో అడుగుపెట్టిన అబినందన్ అని ప్రకటించేశాయి.



కానీ వాస్తవానికి అభినందన్ రాత్రి తొమ్మిదిన్నరకు కానీ భారత గడ్డపై అడుగుపెట్టలేదు. ఓ అరగంట తర్వాత తప్పుతెలుసుకున్న తెలుగు ఛానళ్లు.. మళ్లీ అభినందన్ అప్పగింతలో ఆలస్యం అంటూ వార్తలు ప్రసారం చేశాయి. అయితే ఇక్కడ ఛానళ్లను తప్పుబట్టడానికి కూడా ఏమీలేదనుకోండి. ఉద్విఘ్న దృశ్యాలను, వార్తలను ముందుగా ఇవ్వాలన్నదే వారి తాపత్రయం కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: