సీఎం కావడం నా కల..! 30 ఏళ్లు పాలించడం నా లక్ష్యం..!!: ఇండియా టుడే కాంక్లేవ్ లో జగన్

Vasishta

భ్రష్టు పట్టిపోయిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే తాను అధికారంలోకి రావాలనుకుంటున్నట్టు వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. దేశ రాజకీయాలను సౌతిండియా ఎలా నిర్ణయిస్తుంది అనే అంశంపై ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్ లో జగన్ మాట్లాడారు. తన పాదయాత్ర ద్వారా ప్రజలకు ఓ భరోసా ఇవ్వగలిగినట్టు చెప్పారు. ప్రజాసంకల్ప యాత్ర ద్వారా అనేక అంశాలను ప్రజల నుంచి తెలుసుకున్నానని, వారి సమస్యలు విన్నానని జగన్ వివరించారు..


ప్రతి ఒక్కరికి ఓ కల ఉంటుందన్న జగన్.. తనకు ఏపీ ముఖ్యమంత్రి కావాలన్నది కల అని స్పష్టం చేశారు. ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు పాలించాలనేది తనకున్న సంకల్పమని చెప్పారు. ప్రజలకు సంక్షేమ పాలన అందించాలన్నది లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాలనపై జగన్ మండిపడ్డారు. అబద్ధపు హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. గెలిచిన తర్వాత చంద్రబాబు వాటిని నెరవేర్చలేదని విమర్శించారు. రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమన్న జగన్.. రైతు రుణ మాఫీ పేరుతో చంద్రబాబు వారిని వంచించారన్నారు.


14 నెలలపాటు ప్రజల్లో ఉండి.. తాను ఏం చేయాలనే దానిపై అధ్యయనం చేశానన్నారు జగన్. వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తామని, నిష్పాక్షిక పరిపాలన అందిస్తామని తెలిపారు. మేం తీసుకొచ్చే గ్రామ సచివాలయాలతో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. నవరత్నాలతో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని భరోసా ఇచ్చారు. తన 9 ఏళ్ల రాజకీయ ప్రయాణం ప్రజల మధ్యే గడిచిందని.. ఏ దారిలో నడుస్తున్నా, ఎక్కడ ఉంటున్నా వారి గురించే ఆలోచించాన్నారు.


ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల్లో చాలావరకు కొందరు వ్యక్తులు సృష్టించినవేనని జగన్ అభిప్రాయపడ్డారు. రుణమాఫీ సాధ్యం కాదని తెలిసినా.. చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. అంతకు ముందున్న వడ్డీలేని రుణాలను చంద్రబాబు మాటల వల్ల రైతులు కోల్పోయారని వివరించారు జగన్. చంద్రబాబు పాలనలో ఎన్నో అవకతవకలున్నాయని, ఓ వర్గం వారికి చంద్రబాబు ప్రయోజనం కల్పించారని విమర్శించారు.


 ఏపీకి ప్రత్యేకహోదా ఎవరైతే ఇస్తారో వారికే తన మద్దతు ఉంటుందన్నారు. జాతీయస్థాయిలో ఉన్న రెండు పార్టీలు ఏపీని మోసం చేశాయని జగన్ మండిపడ్డారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఏపీని విభజించారన్న జగన్.. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఒక్కటై పార్లమెంటులో రాష్ట్రాన్ని విభజించాయన్నారు. లోక్‌సభలో ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసి మరీ బిల్లును నెగ్గించుకున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా ఇస్తామని పార్లమెంటులో చెప్పి అమలు చేయలేదని, హోదా రాకపోవడం వల్ల ఉపాధి, ఉద్యోగాలు లేవన్నారు. పార్లమెంట్‌పై నమ్మకం పెరగాలంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ రాజకీయాలకు సంబంధించి ఇప్పటివరకూ తాము తటస్థంగానే ఉన్నామన్న జగన్.. రాష్ట్ర ప్రయోజనాలను ఎవరు నెరవేరుస్తారో వాళ్లతో కలసి వెళ్తామన్నారు. రాష్ట్రానికి కేంద్రం కచ్చితంగా అవసరమన్నారు జగన్. 100 శాతం పన్ను రాయితీ ఇస్తేనే మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. హోదా ఇస్తే కాంగ్రెస్‌కైనా మద్దతిస్తామన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ  ఆవిరైపోయిందన్న జగన్.. ఆ పార్టీకి ఏపీలో ఎలాంటి ఆశల్లేవన్నారు. 6 నెలల కింద చంద్రబాబు అవినీతిపై కాంగ్రెస్ పార్టీ ఓ పుస్తకం విడుదల చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు వాళ్లిద్దరూ కలిసిపోయారని జగన్ ఎద్దేవా చేశారు.


గత ఎన్నికల్లాగే ఈసారి కూడా తాము ఒంటరిగా పోటీ చేస్తామని జగన్ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా బీజేపీ, టీడీపీ, పవన్ కల్యాణ్ కలిసి పోటీచేశారని.. అయినా తామ కేవలం ఒక శాతం ఓట్లతోనే అధికారానికి దూరమయ్యామన్నారు. ఇప్పుడు ఏపీలో విశ్వసనీయతకు-అవకాశవాదానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.


తన తండ్రి బతికి ఉన్నంత వరకు తన మీద ఎలాంటి కేసులు లేవని.., ఆయన చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేస్తాననగానే కేసులు పెట్టారని జగన్ గుర్తు చేశారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసి నా మీద కేసులు పెట్టించాయన్నారు. నాన్న చనిపోయిన తర్వాత నేను ప్రతిపక్షంలో ఉన్నా అధికారం చేతిలో ఉంది కాబట్టి ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద పెట్టినవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులేనని జగన్ వివరించారు. ఏపీని కాంగ్రెస్ విభజిస్తే.. హోదా హామీని మోదీ నిలబెట్టుకోలేదని జగన్ ఆరోపించారు. హోదా విషయంలో ఏపీకి వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. రాజధాని విషయంలో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని, అమరావతి నిర్మాణం పెద్ద కుంభకోణమని విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: