ఇదేం వాదన పాకిస్తాన్..? వింతగా లేదూ...!?

Vasishta

సాధారణంగా యుద్ధం జరిగితే వందలు, వేలాదిమంది సైనికుల ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చూశాం.. అలాగే యుద్ధం వల్ల పెద్ద ఎత్తున ప్రజలు అసువులు బాసిన దుర్ఘటనలు మనకు తెలుసు. అయితే పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్ తర్వాత భారత్ బాలాకోట్ టెర్రరిస్టు స్థావరాలు లక్ష్యంగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి వల్ల తమకు భారీ నష్టం జరిగిందని, ఇందుకోసం భారత్ పై చర్యలు తీసుకోవాలంటూ ఐక్యరాజ్యసమితిని కోరుతామని ప్రకటించింది. ఇంతకూ పాకిస్తాన్ కు జరిగిన నష్టమేంటో తెలుసా...?


రెండు వారాల క్రితం కశ్మీర్ లోని పుల్వామాలో 40 మందికి పైగా జవాన్లు టెర్రరిస్టు దాడుల్లో ప్రాణాలో కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా గత నెల 26వ తేదీన పాకిస్తాన్ లోని టెర్రరిస్టు స్థావరాలు లక్ష్యంగా చేసుకుని భారత్ వైమానిక దాడులు చేసింది. బాలాకోడ్, ముజఫరాబాద్, చికోటి.. తదితర ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. ముఖ్యంగా బాలాకోట్ లో జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ ఆయుధాగారం, ప్రధాన కార్యాలయం ఉన్నాయని భావించి వాటిని టార్గెట్ గా చేసుకుని దాడులు చేసింది.


బాలాకోట్ దాడుల్లో పెద్ద ఎత్తున టెర్రరిస్టులు చనిపోయారని, సుమారు 250 – 300 మంది టెర్రరిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం ఉందని భారత్ ప్రకటించింది. పౌరనష్టం జరగలేదని తెలిపింది. అయితే భారత్ జరిపిన దాడుల్లో ఎవరూ చనిపోలేదని పాకిస్తాన్ ప్రకటించింది. ఒకవేళ అంతమంది చనిపోతే మృతదేహాలు ఉండాలి కదా అని ప్రశ్నిస్తోంది. అంతేకాక.. దాడులు జరిగిన ప్రదేశాలను పరిశీలించాలంటూ అంతర్జాతీయ సమాజాన్ని ఆహ్వానించింది. దీంతో పలు మీడియా సంస్థలు పాకిస్తాన్ లో పర్యటిస్తున్నాయి.


అయితే పాకిస్తాన్ ఓ వింత వాదనను తెరపైకి తెచ్చింది. భారత్ జరిపిన దాడుల వల్ల తమ అటవీ సంపద భారీగా దెబ్బతినిందని ఆరోపిస్తోంది. అడవుల్లోని చెట్లు కూలిపోయాయని, ఇది పర్యావరణానికి హాని కలిగించడమేనని వాదిస్తోంది. దీనిపై ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేస్తామని పాక్ మంత్రి వెల్లడించారు. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన మీడియా ప్రతినిధులు నాలుగైదు చోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడినట్లు వెల్లడించారు. అంతేకాక 15 పైన్ చెట్లు కూలినట్లు తెలిపారు. ఇది తెలిసి అంతర్జాతీయ సమాజం విస్తుపోతోంది. పాకిస్తాన్ లేవనెత్తిన వింత వాదన చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: