‘అలీ’కి సీట్ కన్ఫామ్..!! ఎక్కడో తెలుసా...?

Vasishta

కమెడియన్ గా, హీరోగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన అలీ కొంతకాలంగా రాజకీయాల్లోకి రావాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. తనకు మొదటి నుంచి టీడీపీతో అనుబంధం ఉంది. అయితే ఆ పార్టీలో సీటు దక్కుతుందో లేదోననే అనుమానం ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ, జనసేన అధినేతలను కూడా నేరుగా కలిసి తనకు ఎవరు సీటు కేటాయిస్తే ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇప్పుడు అలీకి సీట్ కన్ఫామ్ అయిపోయింది.


          అలీ కోరిక నెరవేరబోతోంది. ఎంతోకాలంగా రాజకీయ రంగప్రవేశం కోసం అలీ ఎదురు చూస్తున్నారు. సొంతూరు రాజమండ్రి కావడంతో ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అలీ మాత్రం రాజమండ్రి లేదా గుంటూరు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. రాజమండ్రితో పోల్చితే గుంటూరు తనకు సేఫ్ జోనే అనే ఆలోచన కూడా ఉంది. ఇదే విషయాన్ని ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.


          తెలుగుదేశం పార్టీతో అలీకి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ పార్టీ తరపునే ఆయన బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగింది. రాజమండ్రి లేదా గుంటూరు జిల్లా నుంచి ఆయన పోటీ ఖాయమనే ప్రచారం బాగా సాగింది. అయితో రెండు నెలల క్రితం అలీ అకస్మాత్తుగా వైసీపీ అధినేత జగన్ తో భేటీ కావడం సంచలనం కలిగించింది. అంతేకాదు తన మిత్రుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా కలిశారు. దీంతో టీడీపీలో టికెట్ రాదనే ఉద్దేశంతోనే ఆయన వేరే పార్టీల్లో చేరే ఆలోచనలో ఉన్నారని భావించారు. అలీ కూడా తను అడిగిన సీట్ ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ వచ్చారు.


          ఇలాగే నాన్చితే అలీ చేజారిపోవడం ఖాయమని భావంచిన టీడీపీ అధిష్టానం మళ్లీ రంగంలోకి దిగింది. ఆ పార్టీ నేతలు అలీని తీసుకెళ్లి చంద్రబాబును కలిపించారు. ఆ సమయంలో టీడీపీ తరపున కచ్చితంగా సీట్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పుడు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంపై చంద్రబాబు సమీక్ష జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అలీ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సీటును అలీకే ఇవ్వాలని చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.


          అలీకి కూడా పార్టీ అధిష్టానం ఈ విషయం వెల్లడించింది. దీంతో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా అలీ పోటీ చేయబోతున్నారు. ముస్లిం మైనారిటీలు అధిక సంఖ్యలో ఉండడం ఇక్కడ అలీకి కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్న తన ఓటు హక్కును గుంటూరుకు మార్చాలని ఇప్పటికే ఎన్నికల సంఘానికి దరఖాస్తు పెట్టుకున్నారు. దరఖాస్తును పరిశీలించిన ఎన్నికల సంఘం తెలంగాణలో ఓటుహక్కు ఉన్నట్టు వెల్లడించారు. తెలంగాణలో తీసేసి గుంటూరులో ఓటు హక్కు కల్పించాలని అలీ నిర్ధారించారు. దీంతో అలీ గుంటూరు తూర్పు నుంచి పోటీ చేయడం ఖాయమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: