ఎడిటోరియల్ : అధినేతనే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?

Vijaya

సమీక్షల్లో చంద్రబాబునాయుడు ఫైనల్ చేస్తున్న అభ్యర్ధులను చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  పనితీరు సరిగా లేదని రెండు నెలల క్రితం తాను ఎవరిపైనైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారో వారికే ఇపుడు టికెట్లు ఫైనల్ చేస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు ఆగ్రహానికి గురైన ఎంఎల్ఏలందరికీ రాబోయే ఎన్నికల్లో టికెట్లు దక్కవనే అనుకున్నారు అందరూ. తీరా సమీక్షలు మొదలైన తర్వాత ఫైనల్ అవుతున్న అభ్యర్ధుల పేర్లు చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.

 

ఉదాహరణకు అనంతపురం జిల్లానే తీసుకుందాం. నెలన్నర క్రితం జిల్లాలో చంద్రబాబు రెండు రోజులు మకాం వేశారు. ఆ సమయంలో సుమారు ఏడు నియోజకవర్గాల్లోని ఎంఎల్ఏల పనితీరుపై సమీక్షలు చేశారు. వారి పనితీరుపై తాను చేయించుకున్న సర్వేల్లో వచ్చిన ఫీడ్ బ్యాక్ ను చదివి వినిపించారు. అప్పటి లెక్కల ప్రకారం శింగనమల ఎంఎల్ఏ యామినీ బాల, గుంతకల్ ఎంఎల్ఏ జితేంద్ర గౌడ్, కల్యాణదుర్గం ఎంఎల్ఏ హనుమంతరాయ చౌధరి, కదిరి ఎంఎల్ఏ అత్తార్ చాంద్ భాష్, పుట్టపర్తి ఎంఎల్ఏ పల్లె రఘునాధరెడ్డి, మడకశిర ఎంఎల్ఏ ఈరన్న పనితీరు చాలా అధ్వాన్నంగా ఉంది.

 

సరే తర్వాత కోర్టు తీర్పు కారణంగా మడకశిర ఎంఎల్ఏ ఈరన్న పదవిని పోగొట్టుకున్నారనుకోండి అది వేరే సంగతి. ఇక ఎంఎల్ఏలు కాకుండా ఎంఎల్సీ శమంతకమణి పైన కూడా చంద్రబాబు బాగా మండిపడ్డారు. వారి పనితీరు ఎందుకు సరిగాలేదు, వారిపై ఉన్న ఆరోపణలేంటి, కొడుకులు, తమ్ముళ్ళు పార్టీని ఏ విధంగా గబ్బు పట్టిస్తున్నారో వివరిస్తు ఫుల్లుగా క్లాసు తీసుకున్నారు. ‘మీకే టికెట్లిస్తే పార్టీ గెలవదు’ అంటూ స్పష్టంగా చెప్పేశారు. చంద్రబాబు వైఖరి చూసిన తర్వాత పై ఆరుగురికి టికెట్లు రావనే అందరూ అనుకున్నారు.

 

సీన్ కట్ చేస్తే అప్పటి చంద్రబాబు ఆగ్రహమంతా ఏమైందో అర్ధం కావటం లేదు. సర్వేల ఫీడ్ బ్యాక్ అంతా ఏ గంగలో కలిసిందో తెలీలేదు. యామినీబాల పనితీరు అధ్వాన్నంగా ఉందని జిల్లాలో చెప్పిన చంద్రబాబు తర్వాత విజయవాడలో రిలీజ్ చేసిన ఎంఎల్ఏల పనితీరులో మొదటి పదిమందిలో ఉండటమే విచిత్రం. నెల రోజుల్లో ఆమె పనితీరులో అంత మార్పెల వచ్చిందో జిల్లా మంత్రులు, ఎంఎల్ఏలకే అర్ధంకాలేదు.

 

అదే విధంగా శమంతకమణి పనితీరుపై అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు తాజాగా మళ్ళీ ఎంఎల్సీగా ఎలా అవకాశం ఇచ్చారో ఎవరికీ అర్ధం కావటంలేదు.  అప్పుడెందుకు ఆగ్రహం వ్యక్తంచేశారో ? ఇపుడెందుకు మళ్ళీ పొడిగింపు ఇచ్చారో చంద్రబాబుకే తెలియాలి. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎంఎల్ఏలు కావచ్చు లేదా ఆశావహులు కావచ్చు చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసి మరీ టికెట్లు తెచ్చుకుంటున్నారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయ్. పైగా ఇప్పటి వరకూ సమీక్షలే చేస్తున్నారు కానీ ఒక్క ఎంఎల్ఏ పేరును కూడా అధికారికంగా ప్రకటించక పోవటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: