కేసీఆర్ కు ఇగో..! జగన్ కు ఫ్రస్టేషన్ ..!! ఇద్దరిపైనా విరుచుకుపడ్డ చంద్రబాబు..!!

Vasishta

ఏపీ సీఎం చంద్రబాబు జగన్, కేసీఆర్ లపై విరుచుకుపడ్డారు. పార్టీ లీడర్లతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన ఆ ఇద్దరు నేతల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. అహంభావంతో కేసీఆర్, ఫ్రస్టేషన్ తో జగన్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారి మండిపడ్డారు.

 

ఎవరికైనా డేటా ఆనేది ఆస్తితో సమానమన్నారు. అది వ్యక్తికైనా, సంస్థకైనా వర్తిస్తందన్నారు. హైదరాబాద్ లో ఆస్తులకు కూడా రక్షణ లేకుండా చేశారని, పిల్లచేష్టలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు నష్టం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు చేపడితే ఇకపై ఎవరైనా హైదరాబాద్ లో డేటా పెడతారా.. అని ప్రశ్నించారు. అహంకారం నెత్తికెక్కి టిఆర్ఎస్ విపరీత చేష్టలు చేస్తోందన్నారు. వాళ్లకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, హద్దులు దాటి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

 

ఏ పార్టీకి లేని టెక్నాలజీ టిడిపి సొంతమన్న చంద్రబాబు.. లక్షలాది మంది కార్యకర్తల డేటాను క్రియేట్ చేసిందన్నారు. 24 ఏళ్లు కష్టపడి డేటా రూపొందించుకుంటే.. దాన్ని దొంగలించి వైసీపీకి కట్టబెట్టారని, పైగా ప్రభుత్వ డేటా అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తమ నేరం బయట పడిందనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారన్నారు. కావాలనే గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారన్న చంద్రబాబు.. మన డేటా కొట్టేసి మనపైనే కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. వైసిపికి మేలు చేసేందుకే టిఆర్ఎస్ ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతోందని విమర్శించారు.

 

టిడిపి ఓడిపోతుందని చెప్పడానికి కెటిఆర్ ఎవరని చంద్రబాబు ప్రశ్నించారు.. మోది, కెసిఆర్, జగన్ ముగ్గురూ ఉమ్మడి ప్రచారం చేయాలని సవాల్ విసిరారు.. కెసిఆర్ కు సామంతరాజుగా జగన్ మారారని ఎద్దేవా చేశారు. ఏపీని సామంత రాజ్యం చేయాలనేదే కెసిఆర్ కుట్ర అని.. జగన్ ను లొంగదీసుకుని ఏపిపై దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు.

 

ఉమ్మడి రాష్ట్ర ఆస్తుల్లో వాటా ఇవ్వలేదని, 60ఏళ్ల కష్టంతో కూడబెట్టిన ఆస్తులు లాగేశారని ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మూలాలపై దాడులు చేశారని, అయినా ధైర్యంగా ముందుకు పోవడంతో అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. ఓర్వలేకే తప్పుడు పనులకు దిగుతున్నారని విమర్శించారు. మనకు రాజ్యాంగం ఉందన్న చంద్రబాబు.. అధికారంతో ఏదైనా చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సార్వభౌమాధికార దేశంలో మనం ఉన్నామనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.

 

ఆర్టీజిఎస్ డేటా ప్రభుత్వం రూపొందించిందని, గోప్యమైన సమాచారం ఏదీ పబ్లిక్ డొమైన్ లో ఉండదని చంద్రబాబు చెప్పారు. పారదర్శకత కోసమే సంక్షేమ పథకాల సమాచారం అందరికీ అందుబాటులో ఉంచామన్నారు. ఒకప్పుడు దయ్యాలు కూడా పించన్లు తీసుకునేవని, భూమిపై ఇళ్లు లేకుండానే బిల్లులు మింగేశారని గుర్తు చేశారు. టెక్నాలజి ద్వారా రాష్ట్రంలో పారదర్శకత తెచ్చామని చెప్పారు. ప్రభుత్వంలో జరిగేది తెలుసుకోవడం పౌరుల బాధ్యత అని.. దాన్ని ప్రజలకు చేరువ చేయడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రతి ఊళ్లో అభివృద్ది, సంక్షేమం బోర్డులు పెట్టామని, బోర్డులపై పెన్షన్లు, ఇళ్లు, రేషన్ కార్డుల వివరాలున్నాయని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: