ఎడిటోరియల్ : జగన్ ఓటమే వంగవీటి లక్ష్యమట !

Vijaya

వినటానికే ఆశ్చర్యంగా ఉంది.  రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించటమే తమ లక్ష్యంగా వంగవీటి రాధాకృష్ణ భీషణ ప్రతిజ్ఞ చేసినట్లు చంద్రబాబునాయుడు మీడియా ప్రముఖంగా ప్రచురించింది. మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ తో భేటీ సందర్భంగా రాధా ఈ ప్రతిజ్ఞ చేశారట. జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను నిలుపుకోలేక టిడిపి నేతల చెప్పుడు మాటలు విన్న రాధా వైసిపికి రాజీనామా చేశారు. ఎన్నికలకు ముందు వైసిపికి రాధా రాజీనామా చేసిన వెంటనే టిడిపిలో చేరటం ఎంఎల్సీ అవ్వటం జరిగిపోతాయని ప్రచారం జరిగింది.

 

అయితే, రాధా ఇంకా టిడిపిలో చేరలేదుకానీ ఆ పార్టీలో ఎంఎల్సీ సీట్లన్నీ భర్తీ అయిపోయాయి. కాబట్టి రాధా టిడిపిలో చేరినా దక్కే పదవి ఏదీ లేదని అర్ధమైపోయింది. అందుకనే రాబయే ఎన్నికల్లో జగన్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తానంటూ చెప్పారు. తన తండ్రి వంగవీటి రంగాను అవమానించేలా జగన్ వ్యవహరించినందుకే తాను వైసిపి నుండి వచ్చేసినట్లు చెబుతున్నారు.

 

అయితే, రంగాను జగన్ అవమానించినట్లు రాధా ఆధారాలను మాత్రం చూపలేకపోయారు. కాబట్టి వైసిపిలో నుండి బయటకు వచ్చేయటానికే జగన్ పై రాధా బురద చల్లారన్న విషయం స్పష్టమైంది. వైసిపి యువజన విభాగానికి అధ్యక్షునిగా ఉన్నప్పుడు కానీ తర్వాత విజయవాడ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నపుడు కూడా ఏనాడు పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా పనిచేయలేదు. అయినా రాధాను జగన్ ఉపేక్షించారు. రాధా కోరుకున్న అసెంబ్లీ సీటు కాకుండా విజయవాడ తూర్పు కానీ లేదా మచిలీపట్నం ఎంపి సీటులో పోటీ చేయమని జగన్ ఇచ్చిన ఆఫర్ ను రాధా తిరస్కరించారు.

 

దాంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయి చివరకు వైసిపికి రాజీనామా చేసేశారు. సరే పార్టీలో ఉండటం లేకపోతే వెళ్ళిపోవటం రాధా ఇష్టమే. అసలు రాధాకున్న బలమెంత ? అన్నదే అందరిలోను సందేహాలు. మూడు ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్కసారి మాత్రమే రాధా గెలిచారు. గెలిచింది కూడా బిజెపి అభ్యర్ధిమీదే కావటం గమనార్హం. బలహీనమైన అభ్యర్ధి మీద గెలిచి తానో పెద్ద నేతగా రాధా అనుకుంటున్నారు. సమస్యంత ఇక్కడే వస్తోంది.

 

తనను తాను చాలా పెద్ద లీడర్ గా రాధా అనుకుంటున్నారు. దాంతో ఏ పార్టీలో ఉన్నా ఎవరితోను కలిసి పనిచేయలేకపోతున్నారు. రాధా చెబితే కాపులంతా వైసిపికి వ్యతిరేకంగా ఓట్లు వేసేంత సీన్ లేదు. రాధాకు నిజంగానే అంత సీన్ ఉందనుకుంటే ఏ పార్టీకి కూడా రాధాను వదులుకోదు. కాబట్టి వ్యతిరేకంగా ప్రచారం చేసినంత మాత్రాన జగన్ ఓడిపోయేదేమీ లేదు. ముందు తన నాయకత్వం గురించి తాను నిజాయితీగా సమీక్షించుకుంటే రాధాకే మేలు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: