ఎడిటోరియల్ : పోటీ విషయంలో చంద్రబాబు చెప్పింది నిజమేనా ?

Vijaya

ఈ విషయాన్ని ఎవరో చెప్పింది కాదు. స్వయంగా చంద్రబాబునాయుడే చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీ తరపున రాబోయే ఎన్నికల్లో పోటీ చేయటానికి నేతలెవరూ ముందుకు రావటం లేదని చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోయారు. గెలుపు నమ్మకం లేక నేతలు పోటీకి వెనకాడుతుంటే చంద్రబాబు మాత్రం ఇంకో కారణం సిబిఐ మీద చెప్పేస్తున్నారు. పార్టీ పరిస్దితి పూర్తిగా దిగజారిపోయింది. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం నేతల్లో పోయింది. అందుకనే పోటీకి వెనకాడుతున్నారన్నది వాస్తవం.

 

పోయిన ఎన్నికల్లో టిడిపి నుండి 15 మంది సిట్టింగ్ ఎంపిలు గెలిచారు. వైసిపి తరపున గెలిచిన 8 మంది ఎంపిల్లో ముగ్గురిని లాక్కుని తన బలాన్ని 18కి పెంచుకున్నారు. ప్రస్తుతానికి వస్తే టిడిపి తరపున గెటిచిన ఎంపిల్లో ఇద్దరు రాజీనామా చేసి వైసిపిలో చేరారు. అంటే మిగిలింది 13 మంది. వారిలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయటానికి కనీసం 10 మంది వెనకాడుతున్నారు. అందుకే ఎన్నికల్లో పోటీ చేయటానికి నేతలు వెనకాడుతున్నారని చంద్రబాబు చెబుతున్నది.

 

రాయలసీమలోని ఎనిమిది లోక్ సభ నియోజకవర్గాల్లో చిత్తూరు, కడప, కర్నూలు తప్ప ఇంకెక్కడా అభ్యర్ధులు లేరు. పోటీకి సిద్ధమవుతున్న మూడు చోట్ల కూడా గెలుపుపై నమ్మకం లేదు. ఇక అనంతపురం, హిందుపురంలో జేసి దివాకర్ రెడ్డి, నిమ్మల కిష్టప్పలను చంద్రబాబు బలవంతంగా పోటీలోకి దింపుతున్నారు. రాజంపేట, నంద్యాల, తిరుపతిలో అభ్యర్ధులు లేరు.

 

కోస్తా జిల్లాల్లో నెల్లూరు, ఒంగోలు, మచిలీపట్నం సీట్లలో అభ్యర్ధులు ముందుకు రావటం లేదు. గుంటూరులో గల్లా జయదేవ్ పోటీ చేస్తున్నారు. నరసరావుపేటలో సందిగ్దం నెలకొంది. ఉభయగోదావరి జిల్లాల్లో నరసాపురం ఎంపి స్ధానంలో అభ్యర్ధి లేడు. అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో కొత్తవాళ్ళని వెత్తుక్కోవాల్సిందే. అలాగే, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలో సిట్టింగ్ ఎంపి రామ్మోహన్ నాయుడు పోటీకి వెనకాడుతున్నారు. విశాఖపట్నంలో అభ్యర్ధి లేరు.

 

విశాఖపట్నం జిల్లాలోని అరకులో కాంగ్రెస్ లో నుండి టిడిపిలోకి వచ్చిన కిషోర్ చంద్రదేవ్ పోటీ చేస్తారు. విజయనగరంలో పోటీ చేయటానికి అశోక్ గజపతిరాజు వెనకాడుతున్నారు. గెలుపు అవకాశాలు లేవని, పార్టీ అధికారంలోకి రాదన్న విషయం తెలిసిపోవటంతోనే నేతలు పోటీకి వెనకాడుతున్నారు. కానీ చంద్రబాబేమో సిబిఐ దాడులకు భయపడే తమ పార్టీ తరపున పోటీకి నేతలు వెనకాడుతున్నారని చెప్పుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: