ఎడిటోరియల్ : జంబ్లింగ్ విధానంలో అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నారా ?

Vijaya

పరీక్షల సమయంలో జంబ్లింగ్ విధానం అందిరికీ తెలిసిన విషయమే. కానీ అదే జంబ్లింగ్ విధానాన్ని చంద్రబాబునాయుడు అభ్యర్ధుల ఎంపికలో కూడా అనుసరిస్తున్నట్లే కనబడుతోంది. ఈ నియోజకవర్గంలో అభ్యర్ధిని ఇంకేదో నియోజకవర్గంలో పోటీ చేయిస్తున్నారు. ఎంఎల్ఏగా పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతను ఎంపిగా పోటిగా చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక జిల్లాలో ఎంఎల్ఏని ఇంకేదో జిల్లాకు పంపుతున్నారు. ఓ మంత్రికి మరేదో జిల్లాలో టికెట్ కేటాయిస్తున్నారు. టిడిపిలో జరుగుతున్నది చూస్తుంటే అచ్చంగా జంబ్లింగ్ విధానం గుర్తుకు వస్తోంది.

 

తెలుగుదేశంపార్టీ పెట్టినప్పటి నుండి టికెట్ల కేటాయింపులో ఇంతటి కంపు ఎప్పుడూ జరగలేదు. అన్నగారు ఎన్టీయార్ ఉన్నపుడు ఇచ్చిన టికెట్ తీసుకుని అదే మహా ప్రసాదం అన్నట్లుగా  నామినేషన్ వేసి ప్రచారం చేసుకునే వాళ్ళు. ఎన్టీయార్ నుండి చంద్రబాబునాయుడు పార్టీ పగ్గాలు లాగేసుకున్నపుడు కూడా బాగానే ఉండేది. కానీ ఇపుడేమైందో అర్ధం కావటం లేదు. కచ్చితంగా పది నియోజకవర్గాల్లో కూడా అభ్యర్ధులను ఖరారు చేయలేకున్నారు.


ఎక్కడో విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేట ఎంఎల్ఏ వంగలపూడి అనితను పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరులో పోటీ చేయిస్తారట.  సొంత జిల్లాలోనే పనికిరాని ఎంఎల్ఏ ఇంకేదో జిల్లాలో ఎలా పనికి వస్తుంది ? అలాగే, మంత్రి కెఎస్ జవహర్ ను కొవ్వూరులో కాదని కృష్ణా జిల్లాలోని తిరువూరులో పోటీ చేయమంటున్నారు. కొవ్వూరులో పనికిరాని మంత్రి తిరువూరులో ఎలా పనికొస్తారు ? వాళ్ళిద్దరికీ అసలు డిపాజిట్లు వస్తాయా ?

 

ఐదేళ్ళు స్పీకర్ గా పనిచేసి మొత్తం వ్యవస్ధనే భ్రష్టుపట్టించిన సీనియర్ నేత  కోడెల  శివప్రసాద్ టికెట్టుకే దిక్కులేదు. మొత్తం కుటుంబం గురించే పార్టీ నేతలు బహిరంగంగానే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల నుండి మొత్తం కుటుంబాన్నే దూరంగా ఉంచాలని నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో నేతలు రోడ్లపై నానా రచ్చ  చేస్తున్నారు. మొదటి నుండి టిడిపిలోనే ఉన్న సీనియర్ నేతలు టికెట్ల విషయంలో చంద్రబాబు పిల్లిమొగ్గలను చూసి ఆశ్చర్యపోతున్నారు.

 

మిగిలిన టికెట్ల విషయాన్ని పక్కనపెట్టినా పుత్రరత్నం లోకేష్ వ్యవహారం నేతల మధ్య పెద్ద జోక్ గా తయారైంది.  లోకేష్ అక్కడ పోటీ చేస్తాడని కాదు కాదు ఇక్కడని ఇక్కడ కూడా కాదు మరో చోటని రోజుకో లీకు ఇప్పించుకున్నారు. చివరకు తాజాగా మంగళగిరి అంటున్నారు. అసలు పోటీ చేస్తాడా లేదా అనే అనుమానాలున్నాయ్ నేతల్లో. మొత్తం మీద అభ్యర్ధుల ఎంపికలో లాటరీయో లేకపోతే జంబ్లింగ్ విధానాన్నో చంద్రబాబు అనుసరిస్తున్నట్లే కనిపిస్తోంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: