ఎడిటోరియల్ : మూడు నియోజకవర్గాల్లో అభ్యర్ధులే దొరకటం లేదు

Vijaya

చంద్రబాబునాయుడుకు పెద్ద తలనొప్పే వచ్చిపడింది. మూడు ప్రతిష్టాకరమైన లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి పార్టీ తరపున అభ్యర్ధులే దొరకటం లేదు. ఇంతకీ ఆ మూడు నియోజకవర్గాలేవంటే ఒంగోలు, నెల్లూరు, నరసాపురం. ఈ నియోజకవర్గాలు మొదటి నుండి చంద్రబాబుకు సమస్యాత్మకంగానే ఉన్నాయి. అధికారంలో ఉండి అన్నీ రకాలుగా డెవలప్ అయిన నేతలు కూడా పోటీకి వెనకాడుతున్నారంటేనే పార్టీ పరిస్ధితి ఏమిటో అర్ధమైపోతోంది.

 

నెల్లూరులో పోటీ చేయటానికి చంద్రబాబు ఇప్పటికి నలుగురు నేతలతో మాట్లాడారు. వారిలో ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి, బీద మస్తానరావు, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలో ఏ ఒక్కళ్ళు కూడా సిద్ధంగా లేరు పోటీకి. లోక్ సభకు పోటీ చేయమని తమను ఎక్కడ ఇబ్బంది పెడతారో అన్నట్లుగా నేతలు చంద్రబాబును తప్పించుకుని తిరుగుతున్నారట. చివరకు బీదనే ఒప్పించారంటున్నారు.

 

ఇక ఒంగోలు నియోజకవర్గం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మొదటి నుండి ఎంపిగా పోటీ చేయమని ఎంఎల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని చంద్రబాబు ఒత్తిడి పెడుతునే ఉన్నారు. ఒక దశలో అంగీకరించిన మాగుంట తర్వాత అడ్డం తిరిగారు. చివరకు పార్టీని సైతం వదిలేసి వైసిపిలో చేరబోతున్నారట. తాజాగా మంత్రి శిద్దా రాఘవరావును చంద్రబాబు ఒత్తిడి పెడుతున్నారు. కానీ పోటీకి శిద్దా సిద్ధంగా లేనని చెప్పినా వినకుండా బలవంతంగా ఒప్పించారు.

 

ఇక నరసాపురంలో మొన్నటి వరకూ ఉన్న రఘురామకృష్ణంరాజు హఠాత్తుగా వైపిపిలో చేరటంతో టిడిపికి అభ్యర్ధి కరువైపోయారు. ఎవరిని అడిగినా పోటీ చేయమనే చెబుతున్నారు. రాజ్యసభ సభ్యురాలు సీతారామలక్ష్మి, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయడుతో చంద్రబాబు ఎన్నిసార్లు మాట్లాడినా ఉపయోగం కనబడలేదు. దాంతో చంద్రబాబుకు క్షేత్రస్ధాయిలో పార్టీ పరిస్ధితేంటో అర్ధమవుతున్నట్లే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: