ఎడిటోరియల్ : ఎన్నికలపై వివేకా హత్య ప్రభావం ఎంతుంటుంది ?

Vijaya

ఎన్నికలు ఇంకో 24 రోజులుండగా కడప జిల్లాలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగటం పెద్ద సంచలనంగా మారింది. వైఎస్ వివేకా అంటే ఎవరో సాధారణ రాజకీయ నేతకాదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సోదరుడు, వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయానా బాబాయ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో  వైఎస్ అయినా ఇపుడు జగన్ అయినా మొత్తం జిల్లా బాధ్యతలంతా వివేకా చేతిలోనే ఉంచారు. అంటే వివేకా అంటే అంతనమ్మకం.

 

వైఎస్ ఎన్ని ఎన్నికల్లో పాల్గొన్నా మొత్తం ప్రచార బాధ్యతలు, ఎన్నికల వ్యవహారాలన్నింటినీ వివేకానే చూసుకునే వారు. ఇపుడు జగన్ కూడా అదే పని చేస్తున్నారు. వివేకా జమ్మలమడుగు నియోజకవర్గం బాధ్యతలు చూస్తున్నారు. జిల్లాలో నేతలను సమన్వయం కూడా చేస్తున్నారు. వివేకా బాధ్యతలు చూస్తుంటేనే ఎంతటి కీలక వ్యక్తో అర్ధమవుతోంది. అలాంటి వివేకాను హత్య చేయటమంటే చిన్న విషయం కాదు.

 

ఇక వివేకా వ్యక్తిత్వం తీసుకుంటే చాలా సౌమ్యునిగా పేరుంది. జిల్లాలో ఎవరితో కూడా గొడవలు లేవు. ఏ పార్టీ నేతైనా సరే జగన్ ను వ్యతిరేకించే వారుకూడా వివేకాను బాగా గౌరవిస్తారు. అందుకే ఆయన్ను అందరూ అజాతశతృవుగా చెబుతున్నారు. జిల్లాలో రాజకీయపరంగా ఏ గ్రామం తీసుకున్నా వివేకాను తెలీని వాళ్ళు  ఉండరు.

 

అటువంటి వివేకా హత్యకు గురయ్యారంటే అందరూ చలించిపోతున్నారు. సరే హత్య చేసిందెవరు ? ఎందుకు చేశారనేది ఇప్పటికే రాజకీయరంగు పులిమేసుకుంది. కాబట్టి ఆ విషయాన్ని పక్కనపెట్టినా ఆరోపణలైతే టిడిపి చుట్టూనే తిరుగుతోంది. మామూలుగానే ఈ జిల్లాలో టిడిపి చాలా వీకనే చెప్పాలి. పోయిన ఎన్నికల్లో జిల్లాలోని 10 సీట్లలో టిడిపి కేవలం రాజంపేటలో మాత్రమే గెలిచింది. ఇపుడా రాజంపేట ఎంఎల్ఏ కూడా టిడిపికి లేదనుకోండి అది వేరే సంగతి.

 

రాబోయే ఎన్నికల్లో కూడా వైసిపిని తట్టుకుని టిడిపి రెండు సీట్లలో గెలిచినా చాలా ఎక్కువే అనే ప్రచారం బాగా ఉంది. ఇటువంటి పరిస్ధితుల్లో వివేకా హత్య జరగటమంటే టిడిపికి బాగా నష్టం చేసేదనటంలో సందేహం అవసరం లేదు. వివేకా హత్య రాష్ట్రంలో ఎటువంటి ప్రభావం చూపుతుందో చెప్పలేం కానీ జిల్లాలోని  10 అసెంబ్లీలు, 2 లోక్ సభ సీట్లపైన మాత్రం తీవ్ర ప్రభావం చూపే అవకాశాన్ని కొట్టిపారేయలేం.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: