బీజేపీ, కాంగ్రెస్ ఎంత తోపులైనా ప్రాంతీయ పార్టీల ముందు మోకరిల్లాల్సిందే..!

Vasishta

దేశ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. మోదీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి పనిచేస్తోంది. అదే సమయంలో మోదీ కూడా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు అన్నివిధాలా ట్రై చేస్తున్నారు. ఇకా కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలు కూడా తమదైన శైలిలో రాజకీయాలను శాసించేందుకు ప్రయత్నిస్తున్నాయి.


2014 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం దేశ రాజకీయ ముఖచిత్రం చాలా మారింది. నాటి ఎన్నికల్లో మోదీ హవా నడిచింది. బీజేపీ ప్రభంజనం సృష్టించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఎ కుదేలైంది. పదేళ్ల యూపఏ పాలనపై విసిగి వేసారిన ప్రజానీకం.. రాబోయేవన్నీ మంచి రోజులేనంటూ మోదీ ఇచ్చిన హామీలపై నమ్మకముంచింది. ఎన్డీఏకు తిరుగులేని మెజారిటీని కట్టబెట్టింది. దేశానికి కాపలాదారుగా... సామాన్యుడిగా తనను తాను చెప్పుకున్న మోదీ పాలన కోసం ఆసక్తిగా ఎదురుచూసింది.


ఉత్తరాదిలోని ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్ధాన్, బిహార్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఐదేళ్ల క్రితం బీజేపీ ఓట్ల సునామీ సృష్టించింది. మరోసారి ఈ బెల్ట్ తమను గట్టెక్కిస్తుందని ఎన్డీయే విశ్వసిస్తోంది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో 2014లో మోదీ హవా పెద్దగా కనిపించలేదు. ఆ పరిస్ధితిలో ఈ దఫా కూడా పెద్దగా మార్పు కనిపించబోదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారే అవకాశాలున్నాయి. ఏపీలో టీడీపీ, వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్, పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ బలంగా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ-బీఎస్సీ జట్టు కట్టాయి. ప్రభుత్వ ఏర్పాటులో వీటి మద్దతు కీలకం కానుంది. ఈ కూటమిలో కాంగ్రెస్ ను చేర్చుకోకపోయినా.. ఎన్నికల తర్వాత అవి కాంగ్రెస్ తో కలిసే అవకాశాలే ఎక్కువ. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ బీజేపీకి బద్ధ విరోధి. జమ్మూ-కాశ్మీర్లో నేషనల్ కాన్ఫెరెన్స్ పార్టీ, మహరాష్ట్రలో ఎన్సీపీ మద్దతు కాంగ్రెస్ కే అనడంలో అనుమానం లేదు. ఆప్ కూడా కాంగ్రెస్ వైపే అడుగులు వేస్తోంది..


2014 లో మోదీ హవాలో కొట్టుకుపోయిన కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.. గతేడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించింది. ఇతర రాష్ట్రాల్లోనూ బలం పెంచుకుంది. అయితే ఈసారి అధికారం తమదేనన్న ధీమా మాత్రం కాంగ్రెస్ లో కనిపించట్లేదు.. రాహుల్ ప్రభావం పెరిగినా కాంగ్రెస్ లో ఆత్మవిశ్వాసం అంతగా తొణికిసలాడట్లేదు.. కర్ణాటక, కేరళ, అసోం, పంజాబ్ లో కాంగ్రెస్ బలం పెరగొచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.


ప్రాంతీయ పార్టీల మద్దతు ఆవశ్యకతను గుర్తించిన బీజేపీ, కాంగ్రెస్ భేషజాలు లేకుండా వ్యవహరిస్తున్నాయి. మహరాష్ట్రలో ఇన్నాళ్లూ తమపై కత్తులు దూసిన శివసేనను కమలదళం బుజ్జగించి తమతో చేర్చుకుంది. అసోంలో తమను కాదనుకొని వెళ్లిన ఏజీపీతో తిరిగి చేతులు కలిపింది. అప్నాదళ్ వంటి ఉప ప్రాంతీయ పార్టీల డిమాండ్లకు విలువనిస్తోంది. జయలలిత లేని అన్నాడీఎంకే ప్రభావం తమిళనాడులో అంతంత మాత్రమేనని తెలిసినా ఆపార్టీతో పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ ది కూడా ఇదే పరిస్ధితి. బిహార్, కర్ణాటక, మహరాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో బెట్టు చేయకుండా సీట్ల సర్దుబాటు చేసుకుంటోంది. బద్ధద శత్రువైన ఆప్ తో కలిసి వెళ్లడానికి సిద్ధమవుతోంది. తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ-బీఎస్పీ ముందస్తు పొత్తులకు నిరాకరించినా వాటితో దూకుడుగా వ్యవహరించడం లేదు. ఎన్నికల తర్వాత చేతులు కలిపినా చాలన్నట్లు వ్యవహరిస్తోంది కాంగ్రెస్. మరి 2019 ఎన్నికల తర్వాత సీన్ ఎలా ఉంటుందనేది వేచి చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: