ఎడిటోరియల్ : తెలంగాణాలో చేతులెత్తేసిన చంద్రబాబు

Vijaya

తెలంగాణాలో తెలుగుదేశంపార్టీ పనైపోయినట్లుంది. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో టిడిపి నుండి అభ్యర్ధులను రంగంలోకి దింపటానికి చంద్రబాబునాయుడు ఆసక్తి చూపటం లేదు. మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ నుండి కొందరు పోటీ చేసినా ఇద్దరు తప్ప మూడో నేత గెలవలేదు. పైగా ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఓట్లపరంగా దారుణంగా తయారైంది టిడిపి పరిస్ధితి. స్వయంగా చంద్రబాబే ప్రచారం చేసినా గెలవలేదు.

 

దాంతోనే అర్ధమైపోయింది టిడిపి పరిస్ధితేంటో. అందుకు తగ్గట్లే ఎన్నికలైపోయిన తర్వాత తెలంగాణాలో పార్టీని పూర్తిగా వదిలేసినట్లే అని అర్ధమైపోతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎంత పోస్టుమార్టమ్ చేసినా ఉపయోగం కనబడలేదు. ఇదిలావుండగా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చూపాలన్న కొందరు నేతల ఆశలపై చంద్రబాబు నీళ్ళు చల్లేశారు.

 

నల్లగొండ, భువనగిరి నియోజకవర్గాల్లో టిడిపి బలంగా ఉందని కాబట్టి ఒంటిరిగానే పోటీ చేద్దామని టిడిపి నేతలు ఎంత మొత్తుకున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. ఇకపై తెలంగాణా పార్టీ విషయాల్లో తాను జోక్యం చేసుకునేది లేదని స్పష్టంగా నేతలతో చెప్పేశారు. చంద్రబాబు ఉద్దేశ్యంలో తెలంగాణాలో ఎంతగా దృష్టి పెట్టినా లాభం లేదట. తెలంగాణాలో టిడిపి దాదాపు కోమాస్టేజిలోకి వెళ్ళిపోయిందనే అభిప్రాయంలో ఉన్నారు చంద్రబాబు.

 

నిజానికి ఏపిలో టిడిపి ఎంత బలంగా ఉందో తెలంగాణాలో అంతకన్నా ఎక్కువ బలంగానే ఉంది.  అలాంటిది చంద్రబాబు ప్రత్యేక తెలంగాణాకు సహకరించి పెద్ద తప్పు చేశారు. రాష్ట్ర విభజనకు సహకరించి తప్పు చేయటమే కాకుండా 2014లో అధికారంలోకి రాగానే కెసియార్ ప్రభుత్వాన్ని కూలదోయటానికి ప్రయత్నించి ఓటుకునోటు కేసులో దొరికిపోయారు. దాంతో ఆ కేసులో నుండి బయటపడటానికి పదేళ్ళ ఉమ్మడి రాజధాని అయినా హైదరాబాద్ ను వదిలి విజయవాడకు పారిపోవాల్సొచ్చింది.

 

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణాలో దెబ్బతిన్నా ఏపిలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏదో ఒకరోజు మళ్ళీ తెలంగాణాలో పూర్వవైభవం వస్తుందనే నమ్మకం నేతల్లో ఉండేది. ఎందుకంటే చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉండేవారు. అలాంటిది ఓటుకునోటు దెబ్బకు చంద్రబాబు విజయవాడకు పారిపోవటంతో తెలంగాణా నేతలకు దిక్కుతోచకుండా పోయింది. ఫలితంగా టిడిపి కోమాలోకి వెళ్ళిపోయింది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణాలో చంద్రబాబు చేతులెత్తేసినట్లే అనిపిస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: