నిజామాబాద్ లోక్ సభ పోలింగ్‌ అసలు జరుగుతుందా? వాయిదా పడుతుందా? ఏటూ తేల్చని ఈసి!

తెలంగాణా రాష్ట్ర సమితిని నిజామాబాద్ జిల్లా పసుపు రైతు పరుగులు పెట్టిస్తున్నాడు ఉడికిస్తున్నాడు చెమటలు పట్టిస్తున్నాడు. పసుపుకు మద్దతు ధర లేక అల్లల్లాడు తున్నమని అంటూ అగ్గిమీద గుగ్గిలమే అవుతున్నాడు. దిక్కుతోచని నిజామాబాద్ పసుపు రైతు ఏకంగా లోక్‌ సభ ఎన్నికలనే లక్ష్యం చేసి గురి పెట్టేశాడు. మొత్తం 185 మంది పసుపు రైతులు ఈ ఎన్నికల్లో నామినేషన్ వేయడంతో, వీళ్ళు కోరుకున్నట్లు వీళ్ళ సమస్య ఇప్పుడు దేశవ్యాప్తంగా రచ్చకెక్కి చర్చలకు తెరదీసింది. అటు ఎలక్షన్ కమిషన్ పోలింగ్ నిర్వహణపై ఎటూ తేల్చుకోలేక తలపట్టుకుని కూర్చుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రియ తనయ కవిత సొంత నియోజకవర్గం కావడంతో, తెలంగాణ రాజకీయవర్గాల్లో సైతం ఉత్కంఠను రేపుతోంది నిజామాబాద్ ఎన్నిక.


ఇలాంటి పరిస్థితిలో అన్నివర్గాల నుండి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలన్న సలహాలు, సూచనలు అందినప్పటికీ ఎన్నికల సంఘం వాటిని కొట్టిపారేసింది. ఆరునూరైనా నూరారైనా "ఎలక్ట్రానిక్ వోటింగ్ పద్ధతి" లోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది. 2 జీ ఈవీఎంలలో కేవలం 64 మంది అభ్యర్థుల పేర్లకు మాత్రమే అవకాశం ఉండటంతో అత్యాధునిక 3 జీ ఈవీఎం లను తయారు చేయాల్సిందిగా ఈసీఐఎల్ (ECIL) ని ఆదేశించింది ఎన్నికల సంఘం.


పెద్ద సైజు ఊ ఆకారంలో తయారయ్యే ఈ సరికొత్త ఈవీఎంల తయారీ మీద యుద్ధ ప్రాతిపదికన పని చేస్తోంది ఈసీఐఎల్ కానీ, నిజామాబాద్ లోక్‌సభ సెగ్మెంట్‌ లో పోలింగ్ కోసం ఏకంగా 26500 ఈవీఎంలు అవసరమైన దరిమిలా, అన్ని మెషీన్లు ఇప్పటికిప్పుడు తయారు చెయ్యడం అనేది అసాధ్యమని అధికారులు చెబుతున్నారు.


ఇటు కదంతొక్కిన పసుపురైతును నిరుత్సాహ పరిచే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఈవీఎం లపై అవగాహన కోసమంటూ ఈ అమాయక అభ్యర్థులను పిలిపించు కుని ఎటూ తేల్చకుండా వెనక్కు పంపుతున్నారు ఈసీ సిబ్బంది. పైగా తమకు గుర్తులు కేటాయించడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని, తమను ప్రచారం చేసుకోనివ్వడం లేదని పసుపు రైతు అభ్యర్థులు లబోదిబోమని అంటున్నారు.


ఎన్నికల వాయిదాకు డిమాండ్ చేస్తూ కోర్టుకెక్కుతామని అంటున్నారు ఈ 185 మంది రైతు వీరులు. నిజామాబాద్ వీధుల్లో ధర్నాకు దిగారు. అధికారులు వచ్చి సర్దిచెప్పి సాగనంపారు. మరో వైపు, మరి కొన్ని పట్టులేని కారణాలు చూపి నిజామాబాద్ పోలింగ్ తేదీని వాయిదా వేసే ఆలోచన లో కూడా చేస్తున్నట్లు ఈసీ మీద సందేహాలు వస్తున్నాయి పసుపు రైతులకు. కొందరు ప్రభుత్వ పెద్దలు ఈ అంశంపై సీరియస్‌ గా వర్కవుట్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: