అందాల జయప్రదపై వివాదాల ఆజంఖాన్‌ పోటీ

రాజకీయాలలో సభ్యత సంస్కారం చాల నీచ స్థాయికి దిగజారి పోయాయి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పై బహుముఖ ప్రఙ్జాశాలిగా ప్రచారంలో ఉన్న తెలుగుదేశం పార్టి అధికార ప్రతినిధి సాధినేని యామిని చేసిన వ్యాఖ్యలు "పావలాగాడు ... మల్లెపూలు నలపటానికి తప్ప దేనికీ పనికి రాడు..." విద్యావంతులు సంస్కారాభిలాషులు సైతం ఉలిక్కిపడే లా చేశాయి. రాజకీయాల్లో ఇంతకంటే ధారుణమైన వ్యాఖ్యలు చేసుకున్నా ఆ వ్యక్తుల స్థాయి చూసి వారి నుండి ఇంతకుమించి ఊహించలేము అని సరిపెట్టుకున్నాం.

కాని సాధినేని యామిని తొలుత ఒక మహిళ విద్యావంతురాలు, దేస విదేశాల్లో అనేక ఉన్నత ఉద్యోగాలు చేసిన పారిశ్రామిక వేత్త, ఉన్నత సామాజిక స్థాయి నుండి వచ్చిన ఈమె ఇలా నీచ స్థాయి భాష వాడటం విన్నవారే సిగ్గుపడేలా చేసింది. అయితే ఇప్పుడు 70 సంవత్సరాల వయసున్న ఒక అర్ధ శతాబ్ధం రాజకీయ అనుభవమున్న ప్రజా ప్రతినిధి ఒక మహిళ పై చేసిన వ్యాఖ్యలు అందులోని రాజకీయాన్ని పరిశీలిద్ధాం. 

విశ్వ విఖ్యాత భారతీయ చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రాయ్ స్వయంగా జయప్రదను "ది మోష్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఆన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్" - వెండితెర మీద అద్భుత సౌందర్య రాశి" అంటూ ఆయన అనుభూతిని మాటల్లో విశ్వజనీనానికి ఎలుగెత్తి చెప్పారు. అందులో ఇసుమంత తేడా లేదు. అది నిజం. ఈమె ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్‌ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్ధిగా నిలబడ్డారు. 


అలాగే మహిళలపై రాజకీయాలను మనసులో పెట్టుకొని అత్యంత అవమానకర అమానవీయ వ్యాఖ్యలు చేసి, భారత ఎన్నికల వ్యవస్థనే అవమానపరిచిన సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఆజంఖాన్‌ వ్యవహార శైలి కూడా రాంపూర్‌ నియోజకవర్గానికి మరో రకమైన అపకీర్తిని తెచ్చిపెట్టింది. 

పదిహేనేళ్ల క్రితం జయప్రద ను ముంబై నుంచి రాంపూర్‌కి రప్పించిన వ్యక్తి, సమాజ్‌వాదీ పార్టీకి పరిచయం చేసిన మిత్రుడు ఆజంఖాన్‌ ఈ రోజు ఆమెకు బద్ధ శత్రువుగా ఎలా మారిపోయా న్డన్నదే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తనను నాడు పరిచయం చేసిన ఆజంఖాన్‌ ను జయప్రద గౌరవంగా అన్నా! అని సంబోధించే వారు. ఆయనను గురువుగా భావించారు. అయితే సమాజ్‌వాదీ పార్టీలో ఉండగా ఆజంఖాన్‌ – అమర్‌సింగ్‌ మధ్య తలెత్తిన వైషమ్యాల సందర్భంగా జయప్రద అమర్‌ సింగ్‌ పక్షం వహించడం వీరిద్దరి మధ్య అగ్గి రాజేసింది. 


దరిమిలా ఒకనాటి ఈ మిత్రులిద్దరు బద్ధ శత్రువులుగా మారిపోయారు. తదనంతర పరిణామాల్లో అమర్‌సింగ్ను, జయప్రదను సమాజ్‌వాదీ పార్టీ బహిష్కరించింది. 2014 ఎన్నికల్లో "బిజ్నోర్‌" నియోజకవర్గం నుంచి ఆర్‌ఎల్డీ తరఫున పోటీ చేసి జయప్రద ఓడిపోయారు.

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండటం ఆజంఖాన్‌ నైజం. అయితే ఈసారి జయప్రదపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలక్షన్‌ కమిషన్‌ ఆగ్రహానికి కారణమయ్యాయి. అనుచిత వ్యాఖ్యల కారణంగా 72 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆజంఖాన్‌ ను ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. 



గతంలో సైతం తన చిత్రాలను మార్ఫింగ్‌ చేశాడంటూ ఆజంఖాన్‌ పై జయప్రద ఆరోపణలు గుప్పించింది. ఇప్పుడు సైతం ఆమెపై వ్యక్తిగతంగా చౌకబారు వ్యాఖ్యలు చేయడం మరోమారు ఆజంఖాన్‌ని అభాసుపాలు చేసింది. ఇప్పుడు తాజాగా ఆమెపై ఆజంఖాన్‌ ‘పదిహేడేళ్లుగా చూసినా మీకర్థం కాని విషయం నాకు 17 రోజుల్లోనే అర్థమైంది. జయప్రద ఖాకీ నిక్కరు ధరించింది’ అంటూ అంతర్లీనంగా ఆమె ఆర్‌ఎస్‌ఎస్‌ మనిషి అంటూ స్త్రీలను కించపరిచే వ్యాఖ్యలు చేయడం అక్కడి రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేసింది. పైగా తనపై యాసిడ్‌ దాడికి ఆజంఖాన్‌ కుట్ర పన్నాడన్న జయప్రద ఆరోపణలు ఇక్కడి రాజకీయ వాతావరణానికి అద్దం పడుతున్నాయి. 


పదకొండు సార్లు ముస్లింలకే పట్టంగట్టిన ఈ నియోజకవర్గంలో ముస్లింల జనాభా సగానికి పైగా ఉంది. 2004, 2009లో జయప్రద సమాజ్వాదీ పార్టీ టికెట్‌ పై రాంపూర్‌ లోక్‌సభ స్థానానికి ఎన్నికయ్యారు. ప్రస్తుత ఆమె రాజకీయ ప్రత్యర్థి ఆజంఖాన్‌ తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. రాంపూర్‌ నియోజకవర్గ సిట్టింగ్‌ ఎంపీ డాక్టర్‌  నేపాల్‌ సింగ్, 2014లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి నజీర్‌ అహ్మద్‌ ఖాన్‌పై, 23 వేల స్వల్ప ఆధిక్యతతో గెలవగలిగారు. గత ఎన్నిక ల్లో బీఎస్పీ విడిగా పోటీ చేసింది. అయితే ఈసారి మాత్రం ఎస్పీ, బీఎస్పీ పొత్తుపెట్టుకుని తమ ఉమ్మడి అభ్యర్థిగా ఆజంఖాన్‌ ని పోటీకి దింపాయి.

2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లింలు 50.57 శాతం ఉన్నారు. హిందువులు 45.97 శాతం, సిక్కులు 2.80 శాతంగా ఉన్నారు. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. రాంపూర్‌ అక్షరాస్యత 53.34 శాతం మాత్రమే. జాతీయ సగటు కన్నా ఇది చాలా తక్కువ.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: