ఇంటర్ కు అంత్యక్రియలా? మరమ్మత్తు వదిలేసి మట్టిలో కలపటం తుగ్లక్ నిర్ణయం కాదా!

ఇంటర్మీడియట్ పలితాల ప్రకటన ఆ తరవాత తలెత్తిన వివాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు రెండో సారి అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ధారుణంగా తలబొప్పి కట్టింది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు మిగతా అంశాలు సాఫీగా సాగినా, విద్యాశాఖకు సంబంధించి ఇంటర్మీడియట్ పలితాలు తీవ్రస్థాయిలో వివాదాపదమవటమే కాదు, రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు ధారుణ స్థాయికి పడిపోయాయి. ముఖ్యంగా పదిలక్షల మంది విద్యార్థులతో ముడిపడి ఉన్న అంశంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు, విద్యా వేత్తలు, మేధావులు, నిజంగా చెప్పాలంటే ప్రజలంతా ముక్తకంఠంతో తీవ్రస్థాయిలో ఈ విషయాన్ని ఖండించారు.


అంతే కాదు ఇంటర్మీడియట్ కార్యదర్శితో సహా, ఉద్యోగుల్లో ఈ పాపానికి కారణమైన వారిని పదవుల్లో నుంచి తొలగించాలని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలైతే విద్యా శాఖా మంత్రి రాజీనామా చేయాలని గట్టిగా వత్తిడి చేస్తున్నారు. ఇంటర్మీడియట్ తో ఎదిగిన కొన్ని ప్రయివేట్ విద్యాసంస్థలని నిర్మూలించటం మరచి అసలు బోర్డ్ నే రద్ధుచేస్తా మనటం ఎంత అవివేకం. గ్లోబరినా అనబడే సాంకేతిక సహకారం అందించిన సంస్థ మూలాలు ఏమిటీ? అవెక్కడ మొదలయ్యాయి? విద్యా వ్యవస్థని ఉత్పత్తి సంస్థగా మార్చి విద్యార్ధు లను ముడిపదార్ధాలు చేసిన కార్పోరేట్ ను తొలుత నిర్మూలించని నాడు - అందులోని అవినీతికి సహకరిస్తూ వచ్చిన అంతర్గత ద్రోహుల పనిబట్టకుండా మనం అసలు ఇంటర్ వ్యవస్థనే కూల్చివేయటం అంటే నిర్మూలించటమమే కదా!


మరమ్మత్తులు, పునర్నిర్మాణాలు, విస్తరణ లాంటి గుణాత్మక విధానాన్ని వదిలేసి నిర్మూలన అనే ప్రతికూల పద్దతులను పాటిస్తే ఇప్పటి వరకు దానుంచి అనుభవించిన ప్రయోజనాల్ని మంటగలపటం న్యాయమా? 1971లో ప్రారంభించిన ఈ  విద్యావిధానం మొదలై అర్ధశతాబ్ధం గడిచింది అలాంటి విద్యావిధానంలో మనం పొందింది ఏమీ లేదంటారా? కూల్చివేతలు ఎప్పటికీ సమంజసమూ కాదు వివేకమూ కాదు.


గుణాత్మకంగా విశ్లేషనాత్మకంగా జరగాల్సిన పునఃనిర్మాణ ప్రక్రియను వదిలేసి అసలు బొర్డ్ నే నిర్మూలించే ప్రక్రియ ఏనాటికి అనుకూల ప్రయోజనాలను ఇవ్వదు.  తాజా పరిణామాలతో సీఎం తీవ్రస్థాయిలో నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. ఇంటర్ కు అసలు బోర్డు ఎందుకు? ఎప్పటి నుంచో ఇంటర్ బోర్డు వ్యవహారాలకు సంబంధించి ప్రతిసారీ ఏదో వివాదం చెలరేగుతూనే ఉంది కాబట్టి మొత్తానికి బోర్డును ఎత్తేసి, మొత్తం ఇంటర్మీడియట్ ను పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి తీసుకురావాల నే నిర్ణయానికి ముఖ్యమంత్రి దాదాపు వచ్చినట్లు తెలుస్తుంది.


త్వరలో ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోబోతున్నారట. మొన్నటి సమీక్ష తర్వాత ఏ అధికారిపై చర్యకు ఉపక్రమించలేదట అదే సందర్భంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వ్యవహర శైలిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ముఖ్యమంత్రి సీనియర్ ఐఏఎస్, సమర్థుడిగా పేరు పొందిన విద్యాశాఖ కార్యదర్శి జనార్థనరెడ్డికి పూర్తి అధికారం ఇచ్చేశారట. ఈ వివాదం సమసి పోయేలా, విద్యార్థులు, తల్లిదండ్రులలో రగిలిన ప్రభుత్వం వ్యతిరేకత పూర్తిగా సమసిపోయ్రేలా చర్యలు తీసుకోవాలి, ఆ విషయంలో మీపై నమ్మకం ఉందంటూ జనార్థనరెడ్డికి పూర్తి అధికారాలు ధారాదత్తం చేశారని అంటున్నారు.


ఈ పరిస్థితుల్లో మొత్తం ఇంటర్ వ్యవహరాన్ని పాఠశాల విద్యాశాఖ గొడుగు కిందకు తెచ్చి, ఇక నుంచి ఇంటర్మీడియత్ గా కాకుండ్ ప్లస్ 1, ప్లస్ 2 గా (11 మరియు 12 తరగతులు)  సీబీఎస్ఈ తరహా విధానానికి ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపనున్నారని సమాచారం. ఇదే జరిగితే ఇక పాఠశాల విద్యాశాఖ పరిధిలో సెకండరీ బోర్డు కిందే ఇంటర్ పరీక్షలు జరుగుతాయి.  ఇక ఉన్నత విద్యాశాఖ డిగ్రీ, ఇంజనీరింగ్ మిగతా పైస్థాయి విభాగాలను మాత్రమే పర్యవేక్షించనుంది.


అలాగే రెవిన్యూ శాఖపై తీవ్రస్థాయిలో అసంతృప్తిగా ఉన్న కేసీఆర్ బహిరంగంగా తన అసంతృప్తిని పలు సందర్భాల్లో వెళ్లగక్కారు. నమస్తే తెలంగాణ లాంటి పత్రికల్లోనూ ధర్మగంట శీర్షికన రెవిన్యూ శాఖ లీలలపై ప్రత్యేక కథనాలు ప్రచురిస్తున్నారు. పూర్తిగా అవినీతి ప్రక్షాళన జరిగేలా, భూ యాజమాన్య నిర్వహణ శాఖగా రెవిన్యూ శాఖను మార్చబోతున్నారని ఇప్పటికే కొందరు సీనియర్ మంత్రులతో చర్చించారని తెలుస్తోంది.


అలాగే జిల్లా కలెక్టర్ల డిజిగ్నేషణ్లు అంటే పేర్లు కూడా మార్చి, జిల్లా న్యాయాధిపతి, జిల్లా పరిపాలనాధికారి అలా మార్చడానికి రంగం సిద్ధమైపోయింది అంటున్నారు. అలాగే రెవిన్యూ పరిధిలో ఉన్న తహాశీల్దార్, రెవిన్యూ ఇన్-స్పెక్టర్, సర్వేయర్, విఆర్ఏ స్థాయి వరకు పని విభజనతో పాటు ఆయా పోస్టుల పేర్లలో మార్పు చేసి వీటిలో కొన్నింటిని పోలీస్ శాఖతో అనుసంధానం చేయడం వంటి సరికొత్త సంస్కరణలతో కొత్త శాఖలకు రూపకల్పన చేస్తున్నారనేది ప్రగతి భవన్ నుంచి వినిపించే మాట.


జబ్బొచ్చిందని ప్రాణాన్ని తీయటం ఎంతవరకు సబబు? అనేది కొందరి ప్రశ్న. అసలు ఇంటర్ బోర్డ్ లో అశోక్ లాంటి సమర్ధత లేని వ్యక్తులను పోస్ట్ చేయటం ఎంత వరకు సమంజసం? బోర్డ్ కార్యదర్శి అశోక్ ను జనం నిగ్గదీస్తుంటే నేను దళితుణ్ణి కాబట్టే నాపట్ల అలా ప్రవర్తించారనటం ఆయనలోని అసమర్ధత బట్టబయలైంది. పదవుల్లో అత్యున్నతస్థాయికి చేరిన వ్యక్తి అసలు తాను దళితుణ్ణి అని తలచటం సమర్ధనీయమా?  గ్లోబరినా లాంటి అనుభవరహిత సంస్థలకు ప్రభుత్వాధికారుల పర్య వేక్షణ లేకుండా పనులు అప్పగించటంలోని ఔచిత్యం ఏమిటి? రేట్ తక్కువ కోట్ చేశారని కాంట్రాక్ట్ యివ్వటం ఎంతవరకు సమంజసం? వాళ్ళకు కార్యనిర్వహణ సామర్ధ్యం ఉందీ లేనిదీ చూడరా? ఇంతేనా ఇంటర్ బోర్డ్ కార్యదర్శి లాంటి ప్రభుత్వ అధికారుల కెపాసిటీ? సమస్య వస్తే దానిని పరిష్కరించటం అవసరం తప్ప నిషేధించటం అనేది వివేకవంతులు చేయవలసిన పని కాదు! 


ఇంతర్మీడియట్ విధ్యావిధానం చాలా ఉత్తమమైనది కాని దానిలో కొన్ని ప్రయివేట్ విధ్యాసంస్థలు చేరి అక్కడ ఉన్న అధికార ఉద్యోగ వ్యవస్థలను డబ్బుపంచి డమ్మీ చేసి వీటి ఆధిపత్యాన్ని కోనసాగించటమే అన్ని అరిష్టాలకు మూలం. తెలంగాణా ఏర్పడ్డ తొలినాళ్లలో ప్రయివేట్ విద్యా సంస్థలను రాష్ట్రంలో నిర్వీర్యం చేసి ఉంటే ఈ పాటికి ఇంటర్మీడియట్ బోర్డ్ అత్య్త్తమంగా వెలిగి ఉండేది. అలా కాకుండా పేర్లు మారిస్తేనో శాఖల పున్ర్విభజన చేస్తేనో సమస్యలు పరిష్కరించబడవనేది ముఖ్యమంత్రి గుర్తించటం చాలా అవసరం.


ఆయనెక్కడో ప్రగతి భవన్ లో కూర్చొని సమీక్షలు జరపటం సమస్య పరిష్కారానికి వీలవదు  కదా!  అధినేతల నిత్య పరిశీలన, వ్యవస్థలకు భౌతికంగా కూడా దగ్గరగా ఉండటం జరిగితే అవినీతి కొంతవరకు అరికట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: