ఎడిటోరియల్ : 134 సీట్లతో వైసిపికి బంపర్ మెజారిటీ..తేల్చేసిన మరో సర్వే

Vijaya

కౌంటింగ్ దగ్గరకు వస్తున్న కొద్దీ ఫలితాలపై అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది. ఏ నలుగురు కలిసినా ఓటింగ్ సరళి గురించి, రాబోయే ఫలితాల గురించే చర్చించుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే తాజాగా మరో సర్వే వైసిపికి 134 సీట్లు వస్తాయని బల్లగుద్ది మరీ చెబుతోంది. వైసిపి 134 సీట్ల భారీ మెజారిటీతో గెలవబోతోందని సర్వే సంస్ధ కరణ్  కాన్సెప్ట్స్ ఛాలెంజ్ కూడా  చేస్తోంది. 37 సీట్లతో టిడిపికి దారుణ ఓటమి తప్పదని తేల్చేసింది. జనసేనకు ఒకటి, ఇతరులకు మూడు సీట్లు రావచ్చని అంచనా.

 

సర్వేలో అవలంభించిన విధానాలను, అనుసరించిన పద్దతులను, తీసుకున్న శాంపుల్సును కూడా వివరించింది. మతాలు, కులాలు, స్త్రీ, పురుషులు, వయస్సుల వారీగా కూడా సర్వే చేసిందట. అలాగే ఉద్యోగులు, నిరుద్యోగులు తదితరాలను కలిపి ప్రతీ నియోజకవర్గంలోను 7 వేల మందిని టచ్ చేసిందట సర్వేలో. మొత్తం మీద ఏ విధంగా చూసినా జనాల్లో మెజారిటీ సెక్షన్ వైసిపికే అనుకూలంగా ఉన్నారని తేల్చేసింది.

 

రాయలసీమలోని 52 అసెంబ్లీ సీట్లలో వైసిపికి 45 ఖాయమట. చిత్తూరు జిల్లాలోని 14 స్ధానాల్లో వైసిపికి 13 సీట్లొస్తాయట. టిడిపికి వస్తాయని వేసిన అంచనాలో ఒకటి చంద్రబాబునాయుడు పోటీ చేసిన కుప్పం. మరి ఇంకో సీటేదో సస్పెన్స్. కడప జిల్లాలోని పదికి పది సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చేస్తుందట. కర్నూలు జిల్లాలోని 14 స్ధానాలకు గాను 12 సీట్లు వైసిపికి, రెండు సీట్లు టిడిపికి వస్తాయట. అనంతపురం జిల్లాలోని 14 సీట్లలో వైసిపి పది సీట్లకు తగ్గదట. మూడు సీట్లలో టిడిపి గెలిస్తే ఇంకో సీటులో ఎవరైనా గెలవచ్చని తేల్చింది.

 

ఉభయగోదావరి జిల్లాల్లో కూడా వైసిపిదే మెజారిటీ అని తేల్చేసింది. తూర్పుగోదావరి జిల్లాలోని 19 సీట్లలో వైసిపికి 13 సీట్లు, టిడిపికి 6 వస్తాయట. పశ్చిమగోదావరిలోని 15 స్ధానాల్లో 10 నియోజకవర్గాల్లో వైసిపి జెండా ఎగరటం ఖాయమట. పోయిన ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసిపికి ఒక్క సీటు కూడా రాలేదు.  ఇక నెల్లూరులోని 10 సీట్లలో వైసిపికి తొమ్మిది ఖాయమట. మిగిలిన ఒక్కటి సస్పెన్స్.

 

ప్రకాశం జిల్లాలోని 12 సీట్లలో వైసిపికి 11 సీట్లొస్తాయట. టిడిపి గెలుచుకునే ఒక్క సీటేదో సస్పెన్సే. రాజధాని జిల్లాలైన గుంటూరులోని 17 నియోజకవర్గాల్లో  వైసిపికి 12 వస్తాయట. మిగిలిన ఐదు సీట్లు టిడిపి ఖాతాలో వేసింది. అలాగే కృష్ణా జిల్లాలోని 16 సీట్లలో  టిడిపికి 5 సీట్లొస్తే మిగిలిన 11 సీట్లూ వైసిపికేనట.

 

ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లోని  శ్రీకాకుళంలోని 10 సీట్లలో వైసిపికి 7, టిడిపికి మూడు సీట్లు వస్తాయట. విజయనగరంలోని తొమ్మిది సీట్లలో వైసిపికి 6, టిడిపికి మూడు సీట్లు వస్తాయి. విశాఖపట్నంలోని 15 సీట్లలో  వైసిపికి 10 సీట్లు, టిడిపికి నాలుగు సీట్లు వస్తాయట. మిగిలిన ఒక్క స్ధానంలో ఎవరైనా గెలవచ్చని తేల్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: