భారత ప్రధానిని ఒప్పించటానికి హోదా ప్రక్కనబెట్టి దిగివచ్చిన నాటి అమెరికా అధ్యక్షుడు!

అంతర్జాతీయంగా భారత్ ను ప్రతిష్టాత్మకంగా ప్రధాని నరేంద్ర మోడీ తీర్చి దిద్దాడనటానికి సందేహించక్కర్లేదు. పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన పారిస్‌ ఒప్పందాన్ని భారత దేశం అంగీకరించేలా చేయటానికి నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చాలా కష్టపడ్డారని ఆయన సహాయకుడు ఒకరు వెల్లడించారు. అది ఏ స్థాయిలో అంటే ఒక దశలో ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించటానికి అగ్రరాజ్య అధ్యక్షుడిననే విషయాన్నీ పక్కనపెట్టి తాను నల్ల జాతీయుడిననీ ఒబామా చెప్పుకున్నారు అని తెలిపారు. 

అంతేకాదు నరేంద్ర మోదీతో వ్యక్తిగత సాన్నిహిత్యం ఏర్పరచుకోవటం, 2015 భారత గణతంత్ర ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావటం లాంటివి బరాక్ ఒబామా అనుసరించిన ఎత్తుగడల్లో ఉన్నాయని అమెరికా జాతీయ భద్రత విషయాల్లో బరాక్ ఒబామాకు సహాయకుడిగా ఉన్న బెంజమిన్‌ రోడెస్‌, "ఇంటర్నెట్‌ మాధ్యమం పాడ్‌-క్యాస్ట్‌" కు ఇచ్చిన ముఖాముఖిలో వెల్లడించారు.   

"థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల విషయంలో భారత అధికారులు పారిస్‌ లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో దాదాపు 30 నిమిషాల పాటు వాగ్వాదానికి దిగారు. అంతలో అక్కడకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, మా దేశంలో 30 కోట్ల మంది ప్రజలు విద్యుత్తు సదుపాయానికి దూరంగా ఉన్నారు. కానీ మీరు బొగ్గు వాడొద్దని చెబుతున్నారు. అదెలా సాధ్యమని అనగా, బరాక్ ఒబామా అనూహ్యంగా తన జాతీయతను ప్రస్తావించారు" అని బెంజమిన్‌ రోడెస్‌ తెలిపారు. 

"చూడండి! నేను ఒక నల్లజాతీయుడిని. ఆఫ్రికన్‌-అమెరికన్‌ ను. న్యాయబద్ధంగా లేని వ్యవస్థలో మనం ఉన్నామని తెలుసు. మన భుజాలపై భారం మోపి కొంతమంది ధనవంతులు అవుతున్నారు. కాదనను. అయితే, ఆ అసహనంతో నిర్ణయాలు తీసుకుంటే ఎప్పటికీ వారిని అందుకోలేం" అని ఒబామా నచ్చజెప్పారు. సౌరవిద్యుత్‌ తయారీకి అమెరికా సాయపడుతుందని హామీ ఇచ్చి నరేంద్ర మోదీని ఒప్పించారని వివరించారు.  పారిస్‌ ఒప్పందానికి ప్రధాన అవరోధంగా నిలిచిన చైనా, భారత్‌ లనే ఒప్పించటంతో దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ వంటి దేశాలూ దారికి లోకి వచ్చాయని ఆనాటి విశేషాలను బెంజమిన్‌  రోడెస్‌ పూసగుచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: