పీవీ నరసింహారావు తిన్నింటి వాసాలు లెక్కబెట్టారు: చిన్నారెడ్డి

Varma Vishnu

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఎందరో సీనియర్ నేతలను పీవీ నరసింహారావు తొక్కేశారని ఆరోపించారు. పీవీ తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన వ్యక్తి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

అంతేకాకుండా బాబ్రీ మసీదును కూల్చి పీవీ ఘోర తప్పిదం చేశారని, దానివల్లే కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు దూరం అయ్యారని, ఆ తప్పిదం వల్లే ఆయనను గాంధీ కుటుంబం పక్కన పెట్టిందన్నారు. బాబ్రీ మసీదును కూల్చినందుకే పీవీని బీజేపే నేతలు పొగుడుతున్నారంటూ చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు.

 

ఇంతటితో ఆగకుండా మాజీ ప్రధాని ప్రణబ్ ముఖర్జీపై కూడా చిన్నారెడ్డి విమర్శలు చేశారు. ప్రణబ్ కూడా పీవీలాగే వ్యవహరించారన్నారు. ప్రణబ్‌ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతిని చేస్తే.. ఆయనేమో నాగ్‌పూర్‌లో ఆర్ఎస్ఎస్ సభకు వెళ్లి భారతరత్న తెచ్చుకున్నారని ఆరోపించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ బీజేపీకి ఎలాంటి ప్రయోజనం చేయలేదు కాబట్టే ఆయనను బీజేపీ పొగడడం లేదని చిన్నారెడ్డి అన్నారు.

 

తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమని ప్రభుత్వం చెబుతోందని.. కానీ, రాష్ట్రానికి లక్షా పదివేల కోట్ల అప్పు ఉందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించారని, కేంద్ర ఆర్థిక సంఘం చెప్పిన లక్షా పదివేల కోట్లను ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలని, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని చిన్నారెడ్డి డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: