పనవ్ తో పొత్తుకు వైసిపి ప్రయత్నించిందా ?

Vijaya

మొన్నటి ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకోవాలని వైసిపి నేతలు ప్రయత్నిస్తే తాను తిరస్కరించినట్లు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపితో పాటు పొత్తుకు తెలుగుదేశంపార్టీ కూడా ప్రయత్నించిందట. అయితే రెండు పార్టీలను తాను తిరస్కరించినట్లు చెప్పుకున్నారు. ఇందులో ఎంత నిజమన్న విషయాన్ని పక్కన పెడితే పవన్ వ్యాఖ్యలు మాత్రం హాట్ టాపిక్ అయింది.

 

ముందుగా వైసిపి విషయానికి వస్తే పవన్ మాటలను నమ్మటం కొంచెం కష్టమే. ఎందుకంటే జనసేనను ఒక పార్టీగా, పవన్ ను ఓ రాజకీయ నేతగా గుర్తించటానికే జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలేదు.  పవన్ విషయంలో జగన్ వైఖరి గమనించిన తర్వాత ఇక పొత్తుల విషయాన్ని  పవన్ తో ఎవరు ప్రస్తావిస్తారు ? జగన్ కు తెలీకుండా ఎవరైనా పొత్తు చర్చలు చేయగలరా వైసిపిలో ?


జగన్-పవన్ మధ్య పొత్తుకు వైసిపి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ప్రయత్నిస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ తప్పుడు వార్తలుగా ప్రశాంత్ కొట్టేశారు. కాకపోతే ఉభయగోదావరి జిల్లాల్లోని కాపుల ఓట్లను దృష్టిలో పెట్టుకుని కొందరు వైసిపి నేతలు పవన్ తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని సూచిస్తే జగన్ అవసరం లేదని చెప్పిన మాట వాస్తవం.

 

ఇక టిడిపి విషయానికి వస్తే పవన్ తో పొత్తు కోసం స్వయంగా చంద్రబాబునాయుడే ప్రయత్నించిన మాట వాస్తవం. ఆ విషయాన్ని టిడిపి నేతల సమావేశాల్లో చంద్రబాబే స్వయంగా చెప్పుకున్నారు.  ‘పవన్ ఎప్పటికైనా మనోడే కాబట్టి ఎక్కువగా మాట్లాడకండి’ అని చంద్రబాబు చెప్పిన మాట అందరికీ తెలిసిందే.

 

మరి చంద్రబాబు పొత్తుకు ప్రయత్నించినా పవన్ ఎందుకు వద్దనుకున్నారు ? ఎందుకంటే అప్పటికే చంద్రబాబు ప్రభుత్వంపై జనాలో పెరిగిపోయిన ఆగ్రహం పవన్ కు అర్ధమైఉంటుంది.  అందుకే చంద్రబాబుతో పొత్తు వద్దనుకున్నారు.  

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: