చంద్రబాబుకు దేవినేని షాక్

Vijaya

చంద్రబాబునాయుడుకు తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినిష్ పెద్ద షాక్ ఇచ్చారు. ఉరుములేని పిడుగులాగ అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా అవినాష్ రాజీనామా చేశారు. ముహూర్తం చూసుకుని వైసిపిలో చేరటానికి రంగం కూడా రెడీ అయినట్లు సమాచారం. వైసిపిలో చేరితే విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్చార్జిగా బాధ్యతలు ఇస్తామని ఆఫర్ వచ్చిందట. ఆఫర్ నచ్చిన అవినాష్ వెంటనే టిడిపికి రాజీనామా చేసేశారు.

 

నిజానికి దివంగత నేత తండ్రి దేవినేని నెహ్రూతో పాటు అవినాష్ కూడా 2014 సమయంలోనే వైసిపిలో చేరాల్సింది. అయితే జగన్మోహన్ రెడ్డితో ప్యాకేజీ సెట్ కాకపోవటం వల్లే చివరినిముషంలో టిడిపిలో చేరారు. సరే చేరిన దగ్గర నుండి అవినాష్ పార్టీకి అంకితభావంతోనే పనిచేశారు లేండి.

 

మొన్నటి ఎన్నికల్లో కృష్ణాజిల్లాలోని గుడివాడ నుండి పోటీ చేసి ఓడిపోయారు. గుడివాడలో అవినాష్ కు టికెట్ ఇవ్వద్దని నియోజకవర్గంలోని టిడిపి నేతలందరూ ఎంత చెప్పినా వినకుండా చంద్రబాబు అక్కడే టికెట్ ఇచ్చారు. మొత్తానికి ఎంత ఫైట్ చేసినా వైసిపి అభ్యర్ధి కొడాలి నాని చేతిలో సుమారు 17 వేల తేడాతో ఓడిపోయారు. దానికితోడు పార్టీ కూడా ఓడిపోవటంతో  అవినాష్ కూడా సైలెంట్ అయిపోయారు.

 

అదే సమయంలో పార్టీకి చెందిన చాలామంది నేతలు టిడిపికి రాజీనామా చేసి బిజెపిలో చేరిపోతుండటంతో అవినాష్ లో ఆలోచన మొదలైంది. దానికితోడు తమ పార్టీలో చేరాలంటూ వైసిపి నేతల నుండి కూడా ఆఫర్ వచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. మొన్నటి ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసిపి తరపున పోటీ చేసిన భావకుమార్ టిడిపి అభ్యర్ధి గద్దె రామ్మోహన్ చేతిలో ఓడిపోయారు.

 

మొత్తానికి ఇటు చంద్రబాబుకు అటు నారా లోకేష్ కు బాగా సన్నిహితంగా ఉంటున్నా తన భవిష్యత్తుపై అవినాష్ లో ఆందోళన మొదలైందని సమాచారం. పార్టీకి భవిష్యత్తు లేదని పలువురు నేతలు భావిస్తున్నట్లుగానే అవినాష్ కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లున్నారు. అందుకనే అన్నీ విధాలుగా ఆలోచించుకుని చివరకు తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేశారు. మరి చివరకు వైసిపిలోనే చేరుతారో లేకపోతే అనూహ్యంగా బిజెపి కండువా కప్పుకుంటారో చూడాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: