న‌డ్డా...మీ నాట‌కాలు తెలంగాణ‌లో న‌డ‌వ‌వు

Pradhyumna
బీజేపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, కేంద్ర‌మంత్రి జేపీ న‌డ్డాపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. జేపీ న‌డ్డా హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో టీఆర్ఎస్ పార్టీపై దుమ్మెత్తిపోసిన నేప‌థ్యంలో కేటీఆర్ సైతం అదే రీతిలో స్పందించారు. కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌.. బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీజేపీ నేత నడ్డా నాటకాలు తెలంగాణలో నడవవని కేటీఆర్ స్పష్టం చేశారు. 

తెలంగాణలో బీజేపీకి అధికారం జీవితాంతం ఆమడదూరంలోనే ఉంటుందని… ఆ పార్టీ నేతలు పగటికలలు కనడం మానుకోవాలని  కేటీఆర్ వ్యాఖ్యానించారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ నేతలు చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ''తెలంగాణ అడ్డాలో బీజేపీ నడ్డా నాటకాలు నడవవు. ఇతర రాష్ర్టాల్లో వేసిన ఎత్తుగడలు తెలంగాణలో వేస్తే ఊరుకోం. కర్ణాటకలో బీజేపీ చేసిన నాటకాలు ఇక్కడ సాగవు. ఇది కర్ణాటక కాదు.. తెలంగాణ అని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలి. బీజేపీ నేతలు అధికార మత్తులో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు``అని  కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. నీతి ఆయోగ్‌ మెచ్చుకున్న తెలంగాణ పథకాలపై బీజేపీ విమర్శలు చేస్తోంద‌ని త‌ప్పుప‌ట్టారు.  ``మిషన్‌ కాకతీయను నీతి ఆయోగ్‌ ప్రశంసిస్తే.. మీకు కనిపించడం లేదా? బీజేపీ పాలిత రాష్ర్టాల మంత్రులు, అధికారులు తెలంగాణలోని పథకాలను ప్రశంసిస్తుంటే.. నడ్డాకు కనిపించడం లేదా? ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్య శ్రీ చాలా మెరుగైన కార్యక్రమం.దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మిని అమలు చేస్తున్నాం. నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాన్ని సరిచేసుకోవడానికే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. ప్రాజెక్టుల నిర్మాణాలకు సహకరించాల్సింది పోయి విమర్శించడం సరికాదు.  మిషన్‌ కాకతీయకు రూ.5వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేస్తే కేంద్రం ఎందుకు పట్టించుకోలేదు.?` అని ప్ర‌శ్నించారు.
సంక్షేమ కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున అమలు చేస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. `` వ్యవసాయం, పరిశ్రమలు, గృహాలకు కరెంటు ఇస్తున్నాం.  బీజేపీ పాలిత రాష్ర్టాల మంత్రులు, అధికారులు తెలంగాణలోని పథకాలను ప్రశంసిస్తుంటే.. నడ్డాకు కనిపించడం లేదా? కాంగ్రెస్‌ నేతలు అవినీతి అంటూ కాకిగోల పెడుతున్నారు.  ఎగిరెగిరిపడుతున్న బీజేపీ నేతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు`` అని పార్టీ నేత‌ల‌కు హిత‌బోధ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: