తొలి ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది.... ఆలస్యం చేస్తే ప్రయాణీకులకు నష్టపరిహారం

NAGARJUNA NAKKA

భారతీయ రైల్వేకు చెందిన తొలి ప్రైవేట్ రైలు అక్టోబర్ 4న లాంఛనంగా ప్రారంభం కానుంది. లక్నోఢిల్లీ మధ్య ప్రయాణించే తేజస్ ఎక్స్‌ ప్రెస్‌ ను నడిపే బాధ్యతను ఐ.ఆర్.సి.టి.సి సంస్థకు ఇండియన్ రైల్వే అప్పగించింది. లక్నో-ఢిల్లీ మధ్య  ఈ ప్రైవేట్ రైలు పరుగులు తీయనుంది.


భారతీయ రైల్వేకు చెందిన తొలి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ ప్రెస్‌ కు వేల సంఖ్యలో టికెట్లు బుక్ అవుతున్నాయి. మొదటి ప్రైవేట్ రైలు తేజస్ ను  ఐ.ఆర్.సి.టి.సి నడుపుతోంది. అక్టోబర్ 4న యూపీ సీఎం యోగీ దీన్ని ప్రారంభించనున్నారు. మరుసటి రోజు నుంచి లక్నోఢిల్లీ మధ్య తేజస్ ఎక్స్ ప్రెస్ ప్రయాణీకులకు సేవలు అందించనుంది. 


తేజస్ ట్రైన్ కు ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రెండు రోజుల్లోనే 2000 మంది ప్రయాణికులు తొలి ప్రైవేట్ రైలులో టికెట్ బుక్ చేసుకున్నారు. తేజస్ ఎక్స్ ప్రెస్ లక్నో నుంచి ఢిల్లీకి 6 గంటల 15 నిమిషాల్లో చేరుకుంటుంది. ఉదయం 6.10 గంటలకు లక్నోలో బయల్దేరితే ఢిల్లీకి మధ్యాహ్నం 12.25 గంటలకు చేరుకుంటుంది. న్యూ ఢిల్లీలో సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరితే రాత్రి 10.45 గంటలకు లక్నోకు చేరుకుంటుంది. కాన్పూర్, ఘజియాబాద్ లలో దీనికి స్టాప్స్ ఉన్నాయి. భారతీయ రైల్వేకు చెందిన మొట్టమొదటి ప్రైవేట్ రైలు ఇదే. ఇండియన్ రైల్వేస్ అనుబంధ సంస్థ అయిన ఐ.ఆర్.సి.టి.సి  ప్రైవేట్ రైలును నిర్వహించే బాధ్యతలు తీసుకుంది. ఈ రూట్ లో విజయవంతమైతే, ఇతర రూట్ లలో ప్రైవేట్ రైళ్లను అనుమతించనుంది భారతీయ రైల్వే.


తేజస్ ఎక్స్ ప్రెస్ లక్నో నుంచి ఢిల్లీకి ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ.1,125. ఎగ్జిక్యూటీవ్ చైర్ కార్ టికెట్ ధర రూ.2,310. ఢిల్లీ నుంచి లక్నోకు ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ.1,280, ఎగ్జిక్యూటీవ్ చైర్ కార్ టికెట్ ధర రూ.2,450గా నిర్ణయించారు. తేజస్ ఎక్స్ ప్రెస్ లో కాంబో మీల్స్ సదుపాయం కూడా ఉంది. టికెట్ బుక్ చేసుకునేటప్పుడే కాంబో మీల్స్ ఆర్డర్ చేయొచ్చు. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తిచేసుకున్న ఈ ట్రైన్ తొలి ప్రయాణానికి సిద్ధమైంది. 


మోషన్ సెన్సార్ డస్ట్ బిన్‌ ల నుండి ఆటోమేటెడ్ డోర్స్ వరకు.. తేజస్ ఎక్స్‌ ప్రెస్‌ లో సాధారణ ఫ్లైట్ లో ఉండే ఫీచర్ లు అన్నీ ఉన్నాయి. తేజస్ ఎక్స్ ప్రెస్ లో ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఏసీ చైర్ కార్ ఉంటుంది. ప్రతి కోచ్ కి 78 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉంటుంది. తేజస్ ఎక్స్ ప్రెస్ మొత్తం 758 మంది ప్రయాణీకులను తీసుకెళ్లగలదు. తేజస్ రైలులో ప్రయాణించే వారికి రూ.25లక్షల వరకు ఐఆర్సీటీసీ ఉచిత బీమా సౌకర్యం కల్పించనుంది. దీంతో పాటు ఢిల్లీ రైల్వే స్టేషన్ లోని ఎగ్జిక్యూటివ్ లాంజ్ లో కూర్చొనే సదుపాయం, లఖ్నవు జంక్షన్ లో విశ్రాంతి గదులను కూడా ఉపయోగించుకొనే సదుపాయం కల్పించనున్నారు. అంతేకాదు తేజస్ ఎక్స్ ప్రెస్ ఒక గంట కన్నా ఎక్కువ ఆలస్యంగా గమ్యస్థానానికి చేరితే ప్రయాణీకులకు నష్టపరిహారం కూడా అందుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: