ఇకపై ఆవుకూ.. ఆధార్! రైతుకు ఎన్నో లాభాలు..!
ఇన్ఫర్మేషన్ నెట్ వర్క్ ఫర్ అనిమల్స్ ప్రొడక్టివిటీ అండ్ హెల్త్... సింపుల్‌గా చెప్పాలంటే ఇనాఫ్. ఈ పేరుతో పైలెట్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం మూడు జిల్లాల్లో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్, తెలంగాణలోని రంగారెడ్డి, ఏపీలోని చిత్తూరు జిల్లా ఉన్నాయి. గత వారం ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ మూడు నెలల్లో ముగించాలని టార్గెట్ పెట్టుకుంది కేంద్రం. ఈ ప్రాజెక్ట్ అమల్లో ఇక్కడ ఎదురైన అనుభవాలు, ఇబ్బందులు తదితర అంశాలను పరిశీలించి.. దేశమంతటా అమల్లోకి తీసుకురానుంది కేంద్రం.
ఈ పథకంలో ఆవులకు ఆధార్ తరహా నంబర్ కేటాయిస్తారు. ప్రతి ఆవుకు 12 అంకెలతో బార్ కోడ్ గల పట్టీని పశువు చెవికి ట్యాగింగ్ చేస్తారు. ఆ నెంబరుకు రైతు వివరాలతో పాటు పశువు పూర్తి వివరాలు ట్యాబ్ లో నమోదు చేస్తారు. దీంతో.. రైతుకు అందాల్సిన పూర్తి పథకాలు నేరుగా ఆ రైతుకే అందుతాయి. జిల్లాలోని మండలాల్లోని పశుసంవర్థక శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది కేంద్రం.
మొత్తం మీద పశువులకు ఈ ప్రత్యేక నెంబర్ ద్వారా.. కేంద్రం ఎంపిక చేసే కరువు మండలాలలో పశుదాణా, దాణామృతం పంపిణీ పారదర్శకంగా ఉండనుంది. ఇనాఫ్ ట్యాగింగ్ పై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి, పాడి రైతులకు అవగాహన కల్పించేందుకు బిజీగా ఉన్నారు పశుసంవర్ధక శాఖ సిబ్బంది.