హైదరాబాద్: ‘కొండను తవ్వి ఎలుకను పట్టిన’ చందంగా తయారయ్యాయి పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు. ప్రజా సమస్యల్ని చర్చించడానికి ఉపయోగపడాల్సిన సభలు కాస్త రాజకీయ వేదికలుగా మారాయి. కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని మన ప్రజాప్రతినిధులు దుర్వినియోగం చేశారు. కేవలం ఒకే ఒక సమస్యను పట్టుకుని మిగతా అనేక సమస్యల్ని ప్రజాప్రతినిధులు గాలికి వదిలేశారు. ఒక మాటలో చెప్పాలంటే 13రోజులుగా సాగిన ఈ వర్షాకాలపు పార్లమెంటు సమావేశాలు పూర్తిగా నిరాశపర్చాయనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సభా సమయమంతా బొగ్గుతో ముగిసిపోయింది.
లోక్ సభలో బొగ్గు, పెద్దల సభలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మినహా ఉభయ సభల్లోనూ మరే అంశం చర్చకు రాలేదు. బొగ్గు కుంభకోణంపై ప్రధానమంత్రి రాజీనామా చేయాటలంటూ ఎన్డీఏ పట్టుబట్టింది. 13రోజుల పాటు జరిగిన సమావేశాలను అడుగడుగునా బీజేపీ అడ్డుకుంది. ప్రధానమంత్రి రాజీనామాకు బీజేపీ పట్టుబట్టినప్పటికీ...కాంగ్రెస్ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. దేశంలోనే అతి పెద్ద కుంభకోణంగా పేర్కొంటున్న బొగ్గు కుంభకోణంపై పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. పార్లమెంటు లోపల, బయట కాంగ్రెస్ పార్టీని కమలనాథులు ఉతికి ఆరేశారు. బొగ్గు కుంభకోణానికి బాధ్యుడైన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వెంటనే రాజీనామా చేయాలనీ భీష్మించు కూర్చున్నది బీజేపి.
కుంభకోణాలతో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టే ప్రయత్నంతో బీజేపీ సక్సెస్ అయ్యింది. కాంగ్రెస్ నమ్మకద్రోహాన్ని, కుంభకోణాలపై దేశ వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు కూడా కమలనాథులు రె‘ఢీ’ అవుతున్నారు. బొగ్గు కుంభకోణాన్ని కాగ్ బయట పెట్టినప్పటికీ దానిని కమలనాథులు తమకు అనుకూలంగా మల్చుకున్నారు. ప్రధాని రాజీనామానే ఏకైక డిమాండుగా ఉభయ సభలను అడుగడుగునా అడ్డుకున్నారు. మొత్తానికి ఈ పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ ఊపిరాడకుండా చేసింది. కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టడంతో బీజేపీ పూర్తిగా విజయం సాధించినప్పటికీ....ప్రజల సమస్యలు మాత్రం చర్చకు రాకపోవడం విచారకరమనీ చెప్పాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: