పరారీలో ఉండి, బెయిల్ పాట్లలో ఆ పార్టీ అధినేత...!

Padmaja Reddy
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి... తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు క్రియాశీలంగా పనిచేసిన నేత. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి బాగా దగ్గరైన వాడిగా ఉండిన రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన నేత. అయితే ఆ మధ్య బైరెడ్డికి ఉన్నఫలంగా రాయలసీమ సంక్షేమం గురించి గుర్తొచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోంది అంటూ రాయలసీమ ను ప్రత్యేక రాష్ట్రం చేయాలనే డిమాండ్ ఏకంగా ఒక కొత్త పార్టీనే ప్రారంభించాడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. రాయలసీమ పరిరక్షణ సమితి అంటూ పార్టీని మొదలుపెట్టిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి దాన్ని టీఆర్ఎస్ లా అభివృద్ధి చేస్తాడని కొంతమంది అనుకొన్నారు. అయితే ఇప్పుడు అంత సీన్ ఇప్పుడు కనపడటం లేదు! బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలోని బైరెడ్డి సొంతూరు ముచ్చు మర్రి లో జరిగిన ఒక ఫ్యాక్షన్ హత్యలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై అభియోగాలు నమోదయ్యాయి. ఆ హత్యతో బైరెడ్డి కుటుంబీకులకు, ఆయనకు సంబంధం ఉందని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. ఈ నేపథ్యంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అతలాకుతలం అయ్యింది. ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలో ఆయనకు అర్థం కావడం లేదు. మొత్తంగా ఫ్యాక్షన్ ఊబిలో చిక్కుకుపోయాడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. తాజాగా పరారీలో ఉన్న ఆయనే ముందుస్తు బెయిల్ కోసం అప్లై చేసుకొన్నట్టు తెలుస్తోంది. అయితే కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో రాయలసీమ పరిరక్షణ సమితి అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఈ కేసు ఉచ్చులో చిక్కుకోకపోయుంటే.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా ఏదో ఒక ప్రకటనతో వార్తల్లోని వ్యక్తి అయ్యేవాడు. అయితే ఎన్నికల సమయంలో అతడికి ఫ్యాక్షన్ నేపథ్యం పూర్తిగా కట్టడి చేసేది అవుతుంది. మరి ఎలా బయటపడతాడబ్బా?!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: