అగస్టా కుంభకోణంలో గవర్నర్ వాంగ్మూలం నమోదు

Chowdary Sirisha
అగస్టా కుంభకోణం కేసులో సాక్షిగా నరసింహన్ వాంగ్మూలం నమోదు చేసేందుకు సీబీఐ అధికారులు రాజ్ భవన్ చేరుకున్నారు. హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ మాజీ గవర్న‌ర్ ఎంకె నారాయణన్, గోవా మాజీ గవర్నర్ వాంఛూలను సీబీఐ ప్రశ్నించింది. ఇప్పుడు మూడో వ్యక్తిగా నరసింహన్‌ను విచారించనున్నారు. 3,700 కోట్ల‌కుపైగా జరిగిన ఈ కుంభకోణం వ్యవహారంలో ఇప్పటికే వారిరువురూ తమ పదవులకు రాజీనామా చేశారు. హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కుదిరినప్పుడు నారాయణన్ జాతీయ భద్రతా సలహాదారుగా, వాంఛూ ఎస్‌పీజీ చీఫ్‌గా ఉన్నారు. అగస్టా ఒప్పందం కుదిరిన 2005లో నరసింహన్ కేంద్ర ఐబి చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. 2005 మార్చి ఒకటిన జరిగిన కీలక సమావేశంలో వీరిచ్చిన నివేదికలే ఒప్పందానికి కీలకమయినట్లు సీబీఐ భావిస్తోంది. ఈ కేసులో ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ మార్షల్ ఎస్‌పీ త్యాగీతో పాటు మరో 13 మందిపై కేసు నడుస్తోంది. దీనిలో భాగంగానే నరసింహన్‌ వాంగ్మూలం కీలకం కానున్నట్లు సీబీఐ అధికారులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: