కేంద్రంతో ఘర్షణ వద్దు

Chowdary Sirisha
కేంద్రంతో ఘర్షణ వైఖరి వద్దని, స్నేహ పూర్వక వైఖరి అవలంబిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంపిలకు సూచించారు. ఈనెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర సమస్యలపై ముఖ్యమంత్రి ఎంపిలతో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి మొత్తం 28 ప్రధాన అంశాలను గుర్తించి, ఎంపిలకు వాటికి సంబంధించిన వివరాలు అందజేశారు. కేంద్రం ఆంధ్ర పట్ల కొంత సానుకూల వైఖరి అవలంబిస్తున్నా, కేంద్రంతో దీర్ఘకాలం ఘర్షణ పడలేమని, దాని వల్ల రాష్ట్రానికి నష్టం కలుగుతుందని కెసిఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఘర్షణ వైఖరి అవసరం లేదు, అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పట్టుపట్టాలని కెసిఆర్ సూచించారు. తెలంగాణకు సంబంధించిన కీలకమైన సమస్యలను పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాలని ఎంపిలకు తెలిపారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ 54శాతం విద్యుత్ వాటా ఇవ్వక పోవడం వల్ల తలెత్తిన సమస్యలు వివరించారు. ప్రాణహిత- చేవెళ్లకు జాతీయ హోదా కోసం కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడానికి, తెలంగాణకు ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో ప్రశ్నించాలని నిర్ణయించారు. హైకోర్టు విభజన, అఖిల భారత సర్వీసు అధికారులు, ఉద్యోగుల విభజనలో జరుగుతున్న ఆలస్యాన్ని కేంద్రానికి వివరించాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత పార్లమెంటు సమావేశాల సందర్భంగా డిసెంబర్‌లో తాను ఢిల్లీకి వస్తానని , రెండు రోజులు ఢిల్లీలో ఉండి రాష్ట్ర సమస్యలపై ప్రధానమంత్రిని, మంత్రులను కలుస్తానని ముఖ్యమంత్రి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: