షిండే మాటల వెనుక అర్థం ఏమిటో?

తెలంగాణ అంశాన్ని కేంద్ర హోంమంత్రి షిండే మరోసారి తెరపైకి తెచ్చారు. ప్రత్యేక రాష్ట్రంపై చర్చలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయన్న షిండే... సమస్యపై ఎవరు సలహాలు ఇచ్చినా స్వాగతిస్తామన్నారు. అయితే తెలంగాణపై చంద్రబాబు ఇచ్చిన లేఖ సంగతి తెలియదనడం ఆలోచనలో పడేస్తోంది. తెలంగాణపై ఇప్పట్లో అఖిలపక్షం సాధ్యం కాదని ఇటీవల హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు. తాజాగా షిండే మాటమార్చారు. ప్రత్యేక రాష్ట్రం అంశంపై తరచూ తెలంగాణ ఎంపీలతో చర్చిస్తున్నామనీ, చర్చలు నిరంతరం జరుగుతూనే ఉంటాయని తెలిపారు. తెలంగాణ సమస్యకు పరిష్కార మార్గాలు వెతుకుతున్నామని, తెలంగాణపై ఎవరు సలహాలు ఇచ్చినా తాము స్వాగతిస్తామని షిండే వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగిన ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్న షిండే ఈ వ్యాఖ్యలు చేశారు. షిండే తాజా వ్యాఖ్యలు టీ కాంగ్రెస్ ఎంపీలకు హుషారు ఇస్తున్నా... ఆయన మాటల్లో మారిన వైఖరి అయోమయంలోకి నెడ్తోంది. తెలంగాణపై ఎవరు సలహాలు ఇచ్చినా తాము స్వాగతిస్తామన్న షిండే... తెలంగాణపై బాబు లేఖ ఇచ్చిన సంగతి తనకు తెలియదనడం అందర్నీ ఆలోచనలో పడేస్తోంది. మరోవైపు చర్చలు కొనసాగుతూనే ఉంటాయన్న షిండే వ్యాఖ్యల్లో అంతరార్ధం వెతుకుతున్నారు రాష్ట్ర నాయకులు. అసలీ సమస్యను ఎంతకాలం సాగదీస్తారో అదయినా చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: