ఇరు రాష్ట్రాల వాటర్ వార్ !

తెలుగు రాష్ర్టాల మధ్య నిప్పులు రాజేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య తలెత్తిన జల వివాదం రానురాను తీవ్రమవుతోంది. విభజన చిక్కుముళ్ళు వీడకపోవడం, వాటాల లెక్కలు కొలిక్కి రాకపోవడంతో రెండు రాషా్ట్రలు నిత్యం వివాదాల సుడిగుండంలో ఇరుక్కుపోతున్నాయి. వెరసి ప్రజల పాలిట శాపంగా మారింది.

ఒక రాష్ట్రం కరెంట్‌ సమస్యతో కొట్టుమిట్టాడుతుంటే మరో రాష్ర్టానికి దాహార్తి సమస్య ఉంది. ఇన్నాళ్లు శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తిపై వివాదం కొనసాగితే.. ఇప్పుడు నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై వివాదం తలెత్తింది. సాగు, తాగునీటి కోసం సాగర్‌ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని ఏపీ కోరుతుండగా.. మీ వాటా ఐపోయింది మిగిలింది మా వాటానే అంటూ తెలంగాణ అంటోంది. నల్గొండ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని చెబుతోంది. దీంతో ఇరు రాష్ర్టాలు ఈ వివాదాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లాయి. అవసరమైతే న్యాయపోరాటినికీ సిద్ధమంటున్నాయి.

నీటి వివాదంపై ఇరు రాష్ర్టాలు పోటా పోటీగా కేంద్రానికి, కృష్ణా నదీ బోర్డుకు లేఖలు రాస్తున్నాయి. ప్రధాన కృష్ణా నదిలో ఎవరి నీటి వాటా ఎంత, సాగర్‌ ఎడమ కాలువలో రబీకి నీటి విడుదల ఎలా చేయాలో తేల్చాలంటూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డుకు, కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. దీనిపై వారు ఎలాంటి నిర్ణయం చెప్పకపోవడంతో సాగర్‌ నుంచి ఏపీకి నీటిని విడుదల చేయలేమంటూ కృష్ణా బోర్డుకు టీ సర్కార్‌ మరో లేఖ రాసింది. సాగర్‌ కుడి కాలువ కింద ఆంధ్రప్రదేశ్‌ తన వాటా 132 టీఎంసీల నీటిని పూర్తిగా వినియోగించుకుందని ఇక నీటిని విడుదల చేసేది లేదని లేఖలో తేల్చి చెప్పింది.

సాగర్‌ ఎడమ కాలువ కింద తెలంగాణకు 99 టీఎంసీలు వినిగియోగించుకునే వీలుండగా.. ఏపీకి 33 టీఎంసీలు వినియోగించుకునే వీలుంది. ఈ క్రమంలోనే ఎడమ కాలువ కింద నల్గొండ జిల్లాలోని ఆయకట్లుకు నీటిని విడుదల చేయాలని తెలంగాణ కోరుతోంది. ప్రధాన కృష్ణా నది నుంచి తమకు రావాల్సిన కేటాయింపుల నుంచి నీటిని విడుదల చేయాలని తెలంగాణ జలవనరుల మంత్రి హరీష్‌ రావు కేంద్ర మంత్రులను కలిశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, నీటి కేటాయింపుల ప్రకారం తెలంగాణకు రబీకి నీటి కేటాయింపులు లేవని ఉన్న నిల్వలు డెల్టా కింద ఉన్న రబీకి, తాగునీటి అవసరాలకు సరిపోతాయని ఏపీ సర్కార్‌ అంటోంది. శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించాలంటూ ఏపీ సర్కార్‌ కేంద్రానికి లేఖ రాసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: