స్పీకర్ కు వైసీపీ శిక్ష

Padmaja Reddy

కోడెల శివప్రసాద రావుకు భారీ శిక్ష వేయాలని ప్రతిపక్ష వైసీపీ నిర్ణయించింది.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమకు కొరకరాని కొయ్యగా మారిన స్పీకర్ కోడెల శివప్రసాద రావుకు భారీ శిక్ష వేయాలని ప్రతిపక్ష వైసీపీ నిర్ణయించింది. అందుకే, భారీగా కోత తీర్మానాలను ప్రతిపాదించింది. ఏకంగా 50 పద్దుల్లో 300 వరకూ  కోత తీర్మానాలకు నోటీసులు ఇచ్చింది. కోత తీర్మానాలకు నోటీసులు ఇస్తే.. స్పీకర్ కు శిక్ష విధించడం ఎలా అవుతుందని ప్రశ్నించవచ్చు. అక్కడే ఉంది శాసనసభలో అసలు మజాకా.పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సభ్యులు ఎవరైనా ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేయవచ్చు. ఇందుకు చట్టసభల్లో పలు విధానాలు ఉన్నాయి. వాటిలో ఒకటే కోత తీర్మానం. విచిత్రం ఏమిటంటే, కోత తీర్మానం ప్రతిపాదించే అవకాశం ప్రతిపక్షానికి మాత్రమే ఉంటుంది. శాసనసభ నియమ నిబంధనల ప్రకారం మూడు రకాల కోత తీర్మనాలను ప్రతిపాదించవచ్చు. వాటిలో వైసీపీ టోకెన్ కోత తీర్మానానికి నోటీసు ఇచ్చింది. దాదాపు 50 వరకూ డిమాండ్లకు ఒక్కొక్క దానికి వంద రూపాయలు కోత విధించాలంటూ దాదాపు 300 నోటీసులు ఇచ్చింది.


వైసీపీ సభ్యులు తీర్మనాలు ఇచ్చారు 


వాస్తవానికి, అధికార పక్షానికే బలం ఉంటుంది కనక ఇవన్నీ వీగిపోవడం ఖాయం. అయితే, ఈ తీర్మానాలు వీగిపోయాయని చెప్పడానికి మొత్తం తీర్మానాలను స్పీకర్ చదవాల్సి ఉంటుంది. ఉదాహరణకు, విద్యుత్తు చార్జీల పెంపును నిరసిస్తూ విద్యుత్తు శాఖ బడ్జెట్లో వంద రూపాయల కోతకు తాము నోటీసు ఇస్తున్నామంటూ దాదాపు 15 నోటీసులు ప్రతిపక్ష సభ్యులు ఇచ్చారని అనుకుందాం. అప్పుడు స్పీకర్ ఆ నోటీసును, దానిని ఇచ్చిన సంఖ్యను, సభ్యులను చదివి, మూజువాణీ ఓటింగ్ నిర్వహించి అది వీగిపోయిందని చెప్పి దానిని ముగించాలి. ఇలా చేయకపోతే సదరు  తీర్మానాన్ని ఆమోదించినట్లు అవుతుంది. దాదాపు 50 పద్దులకు సంబంధించి వైసీపీ సభ్యులు తీర్మనాలు ఇచ్చారు కనక స్పీకర్ వాటన్నిటినీ చదవాల్సి ఉంటుంది. ఇది ఎంత పెద్ద శిక్ష?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: