జగన్ కేసు.. కోడ్ గుట్టు రట్టు..?

Chakravarthi Kalyan
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది. ఐతే.. ఈ కేసులో లేటెస్టుగా ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన ఓ కీలకమైన ఆధారాన్ని సీబీఐ అధికారులు సంపాదించారు. దాన్ని కోర్టుకు అందించారు. 

దాల్మియా సిమెంట్స్ నుంచి జగన్ సంస్థల్లో కోట్ల రూపాయల నగదు ప్రవహించిన సంగతి తెలిసిందే. దాల్మియా సిమెంట్స్‌కు చెందిన జోయ్‌దీప్‌ బసు అనే వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ లో కీలకమైన సాక్ష్యాలు దొరికినట్టు తెలుస్తోంది. జగన్ ఆస్తుల కేసులో కీలక పాత్రధారి అయిన విజయసాయిరెడ్డి దాల్మియా సిమెంట్స్ ప్రతినిధులకు పంపిన ఈమెయిల్ కూడా అందులో లభ్యమైంది. 

టన్నులు..  అంటే కోట్లా..?


ఆ ఈ మెయిల్ విజయసాయిరెడ్డి.. 3500 టన్నుల స్టాక్‌ అందింది.. ఇంకో 500 టన్నులు పంపండి అని రాశారట. సాధారణంగా సిమెంట్ కంపెనీతో లావాదేవీ కాబట్టి దీన్నిపెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అది సిమెంట్ కు సంబంధించిన వ్యవహారం కాదని.. కోట్ల నగదుకు సంబంధించిన కోడ్ భాష అని సీబీఐ అధికారులు వాదిస్తున్నారు. 

తమ వాదనకు సాక్ష్యంగా ఆ మెయిల్ వెళ్లిన కొన్ని రోజుల ముందు, తర్వాత సిమెంట్ స్టాక్ రాకపోకలు ఏమీ జరగలేదని నిరూపించే సాక్ష్యాలు సంపాదించారు.  ఆ సమయంలో సిమెంటు కానీ, రా మెటీరియల్‌ కానీ దాల్మియా నుంచి విజయసాయిరెడ్డికి వెళ్లలేదని.. కేంద్ర కమర్షియల్‌ టాక్స్‌ వర్గాల నుంచి సీబీఐ ఆధారాలు సంపాదించి కోర్టుకు సమర్పించినట్టు తెలిసింది. హవాలా వ్యవహారాల్లో ఇలా కోడ్ భాష ఉపయోగించడం సాధారణమే. మరి నిజంగా ఇది కోడ్ వ్యవహారమేనా.. లేక కేవలం సీబీఐ అనుమానమేనా.. అన్నది ముందు ముందు తేలనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: