జగన్‌ పోరాడితే పవన్‌ జత కలుస్తాడా?

Krishna A.B
మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించుకు వచ్చే విషయంలో తమ పార్టీ వైఖరి ఏమిటో ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి సోమవారం నాడు విస్పష్టంగా తేల్చిచెప్పారు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం తాను చేయవలసిన పని తనే చేస్తుందని నిరీక్షిస్తున్న కొద్దీ.. తన స్వప్రయోజనాలకోసం జగన్‌ కేంద్రాన్ని నిలదీయడం లేదనే విమర్శలు పెరిగిపోతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్మోహనరెడ్డి అటు కేంద్రాన్ని నిలువెత్తుగా కడిగేసేలా.. ఈ అంశంపై దేశరాజధాని ఢిల్లీలోనే పెద్దఎత్తున ధర్నా చేయడానికి తద్వారా ఈ అంశం మీదికి జాతీయ వ్యాప్త దృష్టిని ఆకర్షించేందుకు నిర్ణయించారు. 


తమ స్వప్రయోజనాలు ఈడేర్చుకుంటూ.. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వపు మోచేతి నీళ్లు తాగుతూ రోజులు వెళ్లదీస్తున్న తెలుగుదేశం నాయకులు, ఎంపీలు.. ఈ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం కోసం ఎలాంటి ఉద్యమాన్ని నడపగల స్థితిలో లేరన్నది వాస్తవం. కొన్నిరోజుల కిందట.. ఏపీ కి చెందిన ఎంపీలకు సిగ్గులేదా? ప్రత్యేకహోదాకోసం వారు పోరాడలేరా? అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించిన నేపథ్యంలో తెలుగుదేశం ఎంపీలు.. ఆయన మీద వ్యక్తిగతంగా ప్రతివిమర్శలతో విరుచుకుపడ్డారే తప్ప.. తాము మాత్రం ప్రత్యేకహోదా కోసం చేసిన కృషి శూన్యం. మీరు పోరాడండి.. మీ పోరాటానికి నేను కూడా జత కలుస్తాను అంటూ పవన్‌కల్యాణ్‌ ఆనాడు చాలా ఘనంగా సెలవిచ్చారు. అయితే ఇప్పటిదాకా తెలుగుదేశం వైపు నుంచి ఒక పోరాట స్కెచ్‌లాంటి రెస్పాన్స్‌ ఏమీ లేదు. 


అయితే అధికార పార్టీ ఎంత ఈసురోమని ఏడుస్తున్నప్పటికీ.. ప్రధాన ప్రతిపక్షం వైకాపా ఈ అంశాన్ని సీరియస్‌గానే తీసుకున్నది. ఆ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి తమ పార్టీకి చెందిన మొత్తం 67 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేయనున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికే ప్రత్యేకహోదాపై పలు ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించలేదని, కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబుకు కూడా కళ్లు తెరచుకునేలా.. ఢిల్లీలోనే.. ప్రభుత్వాలు స్పందించేంత వరకు ధర్నా చేస్తాం అని.. జగన్‌ చాలా ఆవేశంగా ప్రకటించారు. 


ఎవరో ఒకరు ముందడుగు వేయకుండా అసలు ఎలాంటి పనీ జరగదు. మొత్తానికి ఇప్పుడు జగన్‌ ఉద్యమానికి తెరతీశారు. మరి ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ స్పందన ఏమిటి? ఆయన తెదేపా వారు దీక్ష చేస్తే మాత్రమే మద్దతు ఇస్తారా? జగన్‌ దీక్ష చేసినా కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, ప్రత్యేకహోదా కోసం ఈ పోరాటానికి కూడా మద్దతిస్తారా అనేది పలువురిలో సందేహంగా మారింది. పవన్‌కల్యాణ్‌ మాటల్లో రాజకీయ దురుద్దేశాలు లేకుండా.. కేవలం ఏపీ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ఉండేట్లయితే.. జగన్‌ సాగించే పోరాటానికి కూడా మద్దతివ్వాలి. అప్పుడే ఆయన నిజాయితీ తేలుతుంది. అలాకాకుండా.. నోరుమెదపకుండా ఇంట్లో కూర్చుంటే.. రాజకీయాల్లోకి రావడానికంటె ముందుగానే.. ఈ రంగంలో ఉండే కుళ్లు, కుత్సితపు పక్షపాత బుద్దులన్నీ ఆయనకు అలవాటైపోయాయని అనుకోవాల్సి వస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: