గచ్చిబౌలిని తలదన్నేలా అమరావతి స్టేడియాలు..!?

Chakravarthi Kalyan
దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే థీమ్ ను కాస్త మార్చి చెబుతున్నారు. కేపిటల్ అంటే బిల్డింగులు కాదోయ్.. కేపిటలంటే కల్చరోయ్ అంటున్నారు. అందుకే కొత్త రాజధానిని సాంస్కృతిక ఆర్థిక రాజధానిగా మార్చేందుకు నడుంబిగిస్తున్నారు. కల్చర్ అంటే సాహిత్యం, సంగీతం, వినోదం మాత్రమే కాదు.. కల్చర్ అంటే క్రీడలు కూడా. 

ఆటలతో కూడా అభివృద్ది పథాన పయనించవచ్చని చంద్రబాబు ఇప్పటికే ఓసారి నిరూపించారు. గతంలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఏషియన్ గేమ్స్ నిర్వహించి.. దాని నిర్వహణ పేరుతో కేంద్రం నుంచి నిధులు రాబట్టి.. యుద్ధ ప్రాతిపదికన క్రీడా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఆటగాళ్లుకు అందుబాటులో ఉన్న మెరుగైన సౌకర్యాలు బాబు హయాంలో కల్పించినవే. 

ఇప్పుడు అమరావతి నిర్మాణంలోనూ చంద్రబాబు అదే స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు. నయా రాజధానిలో ఆటలకూ అధిక ప్రాధాన్యం ఇస్తూ... ఇంటర్నేషనల్ రేంజ్ ఫెసిలిటీస్ తో ఓ స్పోర్ట్ విలిజే ను నిర్మిస్తారట. ఫెసిలిటీస్ అంటే అలా ఇలా కాదండోయ్.. ఏకంగా ఒలంపిక్ క్రీడలు నిర్వహించే సౌకర్యాలు ఈ క్రీడా గ్రామంలో ఉండేలా పెద్దఎత్తున ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు.

అతిపెద్ద క్రీడా మైదానం, క్రీడా గ్రామం, ఇతర మైదానాలు నిర్మాణంతో పాటు అన్ని రకాల క్రీడల శిక్షణకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు వీలుగా 1200 ఎకరాల భూమిని ఈ స్పోర్ట్స్ విలేజ్ కు కేటాయించాలని నిర్ణయించారు. అమరావతిలో అన్ని క్రీడా పోటీలను ఒకే చోట నిర్వహించే స్థాయిలో నిర్మాణాలు ఉండాలని సీఎం ప్లాన్ చేస్తున్నారట. మరి నిధుల సంగతంటారా.. రాష్ట్రం కొంత, కేంద్రం కొంత, మిగిలింది పిపిపి పద్దతిలో సేకరిస్తారట. సో.. ఇక త్వరలోనే అమరావతి గచ్చిబౌలిని తన్నేస్తుందన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: