మంచిమాట : మనల్ని అందరూ ప్రేమించాలంటే.. మొదట మనం అందరినీ ప్రేమించాలి..!
ఈ సమాజంలో చాలావరకు ద్వేషం, క్రూరత్వం మానవతా దృక్పథం లేకపోవడం లాంటి ఎన్నో అవలక్షణాలు ప్రతి రోజు ఏదో ఒక చోట, చూస్తూనే ఉంటాము. అలాగే గమనిస్తూనే ఉంటాం..ఒక్కొక్కసారి ఈర్ష్యా, ద్వేషాలు అనే లక్షణాలు మనలో కూడా రావడం సహజం. కానీ ఇవన్నీ మనకు తప్పని తెలిసినప్పటికీ , ఏదో ఒక కారణం చేత మనము మనకు తెలియకుండానే ఈ లక్షణాలకు బానిసలు అవుతున్నాము. ఫలితంగా ఒకరికొకరుదూరమవడం, ఎవరిని ఇష్టపడకపోవడం ,ప్రేమానురాగాలు అనేటివి ఎలా ఉంటాయో తెలియకపోవడం లాంటి ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.. వీటన్నింటిని దూరంగా పెట్టి, మనల్ని అందరూ ప్రేమించాలి అంటే మొదట మనం అందరిని ప్రేమించడం నేర్చుకోవాలి..
అప్పుడే ఎంతటి శత్రువునైనా సరే మిత్రులుగా మారుతారు. సత్య యుగం కాలం మళ్లీ వస్తే బాగుండు అని అనిపించేలా ఉండడం కంటే , మనం కూడా సత్యయుగంలో బ్రతుకుతున్నాము అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. సత్య యుగంలో కేవలం మనిషికి మనిషి మాత్రమే తోడుండే వాడు, ఎవరికీ డబ్బు అవసరం వచ్చేది కాదు. కేవలం ప్రేమానురాగాలు మాత్రమే నిండిన యుగం సత్య యుగం.. అందుకే ప్రతి ఒక్కరూ ఆ యుగంలో ఎలా ఉండేవారో, ఇప్పుడు కూడా అలాగే ఉండడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే ప్రతి ఒక్కరు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు.. ఆనందంగా ఉంటేనే కదా.. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు..
ఇక ఈ జీవన సూత్రం పాటించిన వారికి బతుకు విలువ తెలుస్తుంది. అనుభవం లోకి వస్తుంది. జన్మధన్యం అవుతుంది. మనిషి బరువు తో ఉన్నప్పుడు దింపుకోవడం సులభమే ,కానీ మనసు బరువు గా ఉన్నప్పుడు దింపుకోవడం చాలా కష్టం.. దేనినైనా అన్వేషించేది మనిషే. ఆకర్షించేది కూడా మనిషే. కానీ ఆకాశం అందనిది, కాలం ఆగనిది..ఇవన్నీ తెలుసుకునేలోపే జీవితం అంతరించిపోతుంది. అందుకే అనునిత్యం మన అందరి తోడు ఉండేది , మనం చేసిన మంచితనమే..
చేస్తున్న పనిపట్ల శ్రద్ధ వహిస్తే ,అందరి ప్రశంశలు పొందడమే కాకుండా ఫలితం కూడా బాగుంటుంది. లభించిన వృత్తిని పరమ పవిత్రంగా భావించి ఆనందంగా , నిజాయితీతో పని చేయాలి. మన ఆలోచనలు ఎప్పుడూ నిర్మలంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితులలోనూ అదుపు తప్పకుండా, మంచి ఆలోచనలతోనే మనిషి ఆదర్శ ప్రియుడు అవుతాడు.అందరి ప్రేమానురాగాలు పొందడానికి వీలవుతుంది..