మంచిమాట : సృష్టిలో చలనం ఉన్నంతవరకూ ఏది ఆగిపోకూడదు..
దేవుడు మనిషికి ఎన్నోరకాల గొప్ప తెలివితేటలను అందించాడు. కానీ వాటిని మనిషి ఉపయోగించుకో లేకపోగా తిరిగి దేవుడిని తిట్టడం మొదలు పెడుతున్నాడు. అంటే దేవుడి ని తిట్టే ముందు , ప్రతి ఒక్కరికీ ఎలాంటి శక్తిసామర్థ్యాలు ఉన్నాయో తెలుసుకోవాలి. ఏదైనా ఒక పనిని అనుకున్నప్పుడు , ఆ పనిని చేయడానికి నీలో సత్తా ఉందో ?లేదో ?కూడా ముందు తెలుసుకోవాలి. అప్పుడే ఎంతటి కష్టం వచ్చినా ఆ పనిని సులభంగా చేసుకోగలరు.. అయితే ఈ సందర్భాన్ని అనుసరించి, మనిషికి కావలసిన శక్తిసామర్థ్యాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చూసి తెలుసుకుందాం..
ఇటీవల కాలంలో చాలా మంది మనుషులు బద్ధకానికి గురి అవుతున్నారు. అందుకు కారణం సాంకేతిక టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలామంది సుఖానికి అలవాటు పడ్డారు. దేహాన్ని విశ్రాంతికి అలవాటు అయ్యేలా చేశారు. ఇక ఫలితంగా ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా నా చేత కాదు ,నా వల్ల కాదు ,అనుకునే వాళ్ళు ..మీకు చేతనైతే పరిగెత్తాలి. లేదా నడుస్తూ వెళ్లాలి. అది కూడా చేత కాకపోతే పాకుతూ అయినా వెళ్లాలి.. అంతేకాని ఒకేచోట అలా కదలకుండా రాయిలాగా ఉండిపోవడం చేయకూడదు...
చాలా మంచి ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిందని ,స్నేహితుడు మోసం చేశాడని , ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్లిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? పోయినవి ఏవి తిరిగి రావు. నీవు ప్రయత్నించు ,తప్పకుండా దేనినైనా సులభంగా సాధించగలవు. దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు కెరటాలే ఎగిసి పడుతుంటే, అన్ని శక్తి సామర్ధ్యాలు ఉన్న ఒక మనిషి ఎందుకు ముందుకు వెళ్లలేక పోతున్నాడు.
నువ్వు తలుచుకుంటే, ఇక నీ తలరాత ఇంతే అన్న వాళ్లు కూడా నీ ముందు తలెత్తుకునేలా చేయగల సత్తా నీలో ఉండాలి. అంతే కానీ ఇప్పుడు వచ్చిన ఆ కాస్త కష్టానికే తలోంచేస్తే ఎలా? జీవితం చాలా ఉంది. సృష్టిలో చలనం ఉన్నదేదీ ఆగిపోకుండా ఉండాలి. అప్పుడే దేనినైనా సులభంగా సాధించగల శక్తిసామర్థ్యాలు నీలో వస్తాయి.